PM Surya Ghar Yojana: కోటి ఇళ్లకు కరెంట్ ఫ్రీ.. సూర్యఘర్ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం..
- IndiaGlitz, [Thursday,February 29 2024]
దేశ ప్రజలకు లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత పెంచి సామాన్య ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా తీసుకొచ్చిన ప్రధాని సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.75,021 కోట్లతో రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్(Rooftop solar scheme)కు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 2025 నాటికి దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.
ఈ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే కుటుంబాలకు రూ.78వేల వరకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పథకంలో చేరేందుకు pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రజలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు చెప్పారు. దీని ద్వారా దేశంలోని కోటి కుటుంబాలు లబ్ధి పొందనున్నాయన్నారు.
కాగా ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana)’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని ఇటీవ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో సోలార్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఈ పథకం ప్రవేశపెడుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రూ.75వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్‌తో.. ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పథకం కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందొచ్చు. ప్రజలపై ఎలాంటి వ్యయభారం ఉండదని హామీ ఇస్తున్నాం అని వెల్లడించారు.
క్షేత్రస్థాయిలో ఈ పథకానికి ప్రచారం తీసుకొచ్చేందుకు పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు మోదీ తెలిపారు. తమ పరిధిలో ఈ రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ప్రోత్సహించాలని సూచించారు. దీని వల్ల విద్యుత్ బిల్లులు తక్కువ రావడంతో పాటు ఉపాధి కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. గృహ వినియోగదారులతో పాటు యువత ఈ ‘సూర్య ఘర్’ పథకాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నట్లు మోదీ చెప్పకొచ్చారు. తాజాగా ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.