SC: ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ముందడుగు.. కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీ.. నెరవేర్చే దిశగా కార్యాచరణ ప్రారంభమైంది. దీనిపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని నియమించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షుడిగా ఉండగా.. సభ్యులుగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, గిరిజన శాఖ కార్యదర్శి, సామాజిక న్యాయ శాఖ కార్యదర్శులు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీంకోర్టు గతంలో అంగీకారం తెలిపిన మేరకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 23వ తేదీన ఈ కమిటీ తొలిసారి భేటీ అయి ఎస్సీ వర్గీకరణ అమలుపై చర్చించనున్నారు.
కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలో ఓ కమిటీ వేసి న్యాయం చేస్తామని తెలిపారు. వర్గీకరణ కోసం మందకృష్ణ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్.. అనేది బీజేపీ విధానం.. పేదరిక నిర్మూలనే తమ ప్రధాన లక్ష్యమన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఎన్నో ప్రభుత్వాలు మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చాయి కానీ నెరవేర్చలేదన్నారు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా ఒక లక్ష్యం కోసం ఉద్యమిస్తున్నారని కొనియాడారు. ఆయన పోరాటం న్యాయమైందని తెలిపారు.
కాగా మాదిగల రిజర్వేషన్ కోసం మందకృష్ణ మాదిగ మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి(MRPS) సంస్థను ఏర్పాటుచేసి పోరాడుతున్నారు. ఎస్సీలు ఎక్కువగా ఉండటంతో తెలుగు రాష్ట్రాలోని మాదిగలకు ఉద్యోగాలు సహా ఇతర విషయాల్లో రిజర్వేషన్లు, ఇతర బెనిఫిట్స్ తమకు అందడం లేదని ఆయన వాపోతున్నారు. దీంతో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఆయన అన్ని పార్టీలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎట్టకేలకు ప్రధాని మోదీ ఆయన పోరాటాన్ని గుర్తించి ఎస్సీ వర్గీకరణ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు కేంద్ర ప్రభుత్వ అధికారులు తమ కార్యాచరణ ప్రారంభించారు. త్వరలోనే ఈ కమిటీ దీనిపై సుదీర్ఘంగా చర్చించి ఓ నివేదికను ప్రధానికి అందజేయనున్నారు. అనంతరం ఆ నివేదిక ఆధారంగా ఎస్సీ వర్గీకరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout