Parliament: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్

  • IndiaGlitz, [Wednesday,December 13 2023]

అత్యాధునిక సౌకర్యాలు, అత్యంత పటిష్టమైన భద్రత ఉండే పార్లమెంట్‌లో ఈ స్థాయి భద్రతా వైఫల్యం జరగడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అడుగుడుగునా సెక్యూరిటీ, ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు, ఇతర ప్రత్యేక బలగాలు ఉండే పార్లమెంట్ ఆవరణలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది పూర్తిగా భద్రతా వైఫ్యలమనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతా వైఫల్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుంటోంది. అయితే ఆ ఇద్దరు దుండగులు మైసూరుకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప సిన్హా కార్యాలయం నుంచి గ్యాలరీలోకి వెళ్లేందుకు పాస్ పొందారని తెలుస్తోంది. దీంతో ఎంపీ కార్యాలయానికి చెందిన సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు.

మరోవైపు ప్రజాస్వామ్యానికి అద్దం లాంటి పార్లమెంట్ లోకి ఆగంతకులు టియర్ గ్యాస్ తో ప్రవేశించడంపై పలు పార్టీల ఎంపీలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే బాధ్యత ఎవరూ వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని.. వారు కిందకు దూకినప్పుడు వెనుక బెంచీలు ఖాళీగా ఉండడంతో పట్టుకున్నారని.. ఇద్దరు మంత్రులు సభలో ఉన్నారని శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన ఎంపీ అరవింద్ సావంత్ తెలిపారు. విజిటర్స్ గ్యాలరీలోకి రావాలంటే కూడా ఐదంచెల సెక్యూరిటీ భద్రత దాటి రావాల్సి ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం తెలిపారు. అలాంటి కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను దాటి సభలోనికి ఆగంతకులు ప్రవేశించడంపై ఆయన మండిపడుతున్నారు. వారు సభలో వదిలిన పొగ ప్రాణాంతకమైన విష రసాయనం అయి ఉంటే పరిస్థితి ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఈ ఘటన అనంతరం ప్రారంభమైన లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ సభలోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతుకులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సభలో వదిలిన గ్యాస్ పొగ ప్రమాదకరమైనది కాదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అది కలర్ స్మోక్ అని.. ఎంపీలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిపేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశామని ఆయన వెల్లడించారు.