అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు కేంద్రం నోటీసులు..

  • IndiaGlitz, [Friday,October 16 2020]

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ విషయంలో కేంద్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంతే కాదు ఆయా సంస్థలకు నోటీసులు సైతం జారీ చేసింది. దసరా పండుగను పురస్కరించుకుని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థ గత అర్థరాత్రి నుంచే బిగ్‌బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ సేల్స్‌తో బిజిబిజీగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఈ సంస్థల వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఒక వస్తువును అమ్మే విషయంలో ట్రాన్స్‌పరెన్సీ పాటించడం లేదని కేంద్రం బావిస్తోంది. వస్తువును అమ్మకానికి వెబ్‌సైట్‌లో ఉంచడానికి ముందే ఆ వస్తువుకు సంబంధించిన మూలం, ఏ దేశంలో తయారైందన్న విషయాన్ని వినియోగదారుడికి తెలియజేయాలన్న తప్పనిసరి నిబంధనను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ విస్మరించాయంటూ కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా వివరాలను తెలియజేయకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఫ్లిప్‌కార్ట్ 16 నుంచి 21 వరకూ పండుగ ఆఫర్లు ఉంటాయని ప్రకటించగా, అమెజాన్ పండుగ సేల్స్ 17 నుంచి మొదలు పెట్టనున్నట్లు ప్రకటించింది.