CAA: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. సీఏఏ అమలు చేస్తూ నోటిఫికేషన్..
Send us your feedback to audioarticles@vaarta.com
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను నేటి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2019 డిసెంబర్ 11వ తేదీన ఈ పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందింది. దీనికి సంబంధించి అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా సంతకం చేశారు. అయితే ఈ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో నిబంధనలు, విధివిధానాలు మాత్రం ఇప్పటివరకు కేంద్రం రూపొందించలేదు. తాజాగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ చట్టాన్నిఅమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి భారత్ పౌరసత్వాన్ని ఇచ్చేందుకు కేంద్రం ఈ నిబంధనల్ని రూపొందించింది. దీని ప్రకారం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు భారత్ పౌరసత్వం లభిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ముగుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన నిబంధనలు నోటిఫై చేయడంతో ఈ చట్టం అమలులోకి వచ్చింది. కాగా ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల పలుమార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే 1995లో వచ్చిన పౌరసత్వ చట్టానికి సవరణలు చేస్తూ 2019లో ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది. 1995 చట్టంలో తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంలో విదేశాల నుంచి వలస వచ్చిన ముస్లింలను మినహాయించడం తీవ్ర దుమారం రేపింది. దీంతో 2019లో తీసుకువచ్చిన ఈ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని కొన్ని బీజేపీయేతర రాష్ట్రాలు.. సీఏఏను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయమని తేల్చి చెప్పాయి. మొత్తానికి ఎన్నికల వేళ కీలకమైన సీఏఏ చట్టం అమల్లోకి తీసుకురావడం బీజేపీ మాస్టర్ ప్టాన్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments