కరోనా మార్గదర్శకాలను పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు..
- IndiaGlitz, [Tuesday,December 29 2020]
దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి విధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోమారు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జనవరి 31 వరకూ కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. భారత్లో ఇటీవలి కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకతను మరోమారు వెల్లడించింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను జనవరి 31 వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. నవంబర్ 25న కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలనే తిరిగి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. మరోవైపు బ్రిటన్లో కరోనా కొత్త వైరస్ వ్యాప్తి కారణంగా కూడా కరోనా నిబంధనలను కేంద్రం పొడిగించింది. కాగా.. కంటైన్మెంట్ జోన్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.