ఏపీకి ప్రత్యేక హోదా అంశం ముగిసింది: కేంద్రం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశంపై ఇక ఏ మూలనో ఆశలు ఉండి ఉంటే.. నిన్నటితో పటాపంచలై పోయి ఉంటాయి. లోక్‌సభ సాక్షిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్.. ప్రత్యేక హోదా లేదని తేల్చి చెప్పారు. మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు, వైసీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు రాయ్ సమాధానమిస్తూ.. 14వ ఆర్థిక సంఘం నివేదికతోనే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించే అంశం ముగిసిందని స్పష్టం చేసింది. హోదాకు బదులుగా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కేంద్ర ఆర్థిక శాఖ ప్రయోజనాలు కల్పించిందని రాయ్ తేల్చి చెప్పారు. ఇక రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ తాము నెరవేర్చామని.. ఇక పెండింగ్‌లో ఏమీ లేవని స్పష్టం చేశారు.
ఇక రెండు రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏర్పడే వివాదాలను పరిష్కరించేందుకు సైతం కృషి చేశామని లోక్‌సభ సాక్షిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్.. వెల్లడించారు. దీనిలో భాగంగానే పలుమార్లు ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్దేశించామని.. సూచనలు సైతం చేశామని స్పష్టం చేశారు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాల అభివృద్ధికి అనేక నిబంధనలు ఉన్నాయన్నారు. పెండింగ్ హామీల అమలుకు తాము రెండు రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి ఉందన్నారు. అందులో కేంద్రం లేదంటే కేంద్ర హోం శాఖ జోక్యం ఏమీ లేదన్నారు. సామరస్యపూర్వక వాతావరణంలో సమస్యను పరిష్కరించామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు.
ఈ మధ్య కేంద్రం చేస్తున్న ప్రకటనలతో.. ఏపీకి కేంద్రం దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఇప్పటికే విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేసి తీరుతామని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఏపీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. నిత్యం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలతో అట్టుడుకుతోంది. తాజాగా హోదా లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది. ప్యాకేజీ సైతం ఇచ్చేశామని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం కొడుతున్న దెబ్బలకు ఏపీ ప్రజల తలలు బొప్పి కడుతున్నాయి. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీ వచ్చి మట్టి ఇచ్చి వెళ్లింది మొదలు నేటి వరకూ అన్ని రకాలుగా అన్యాయమే జరుగుతోందని ఏపీ ప్రజానీకం వాపోతోంది. తాజాగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి చెప్పిన మాటలు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments