3 రాజధానులపై తేల్చేసిన కేంద్రం!
- IndiaGlitz, [Tuesday,February 04 2020]
నవ్యాంధ్ర రాజధాని అమరావతినితో పాటు మరో క్యాపిటల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు డిసెంబర్-19న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే.. జగన్ ప్రకటన చేసిన నాటి నుంచి నేటి వరకూ ఆందోళనలు, నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రాజధాని ప్రాంతాల రైతులు, రైతు కూలీలు నిరసన చేపడుతున్నారు. వీరికి తోడుగా టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన నేతలు- కార్యకర్తలు, ప్రజా సంఘాలు సైతం పాల్గొ్న్నాయి. ఇందుకు సంబంధించిన బిల్లును ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఇప్పటి వరకూ ఈ వ్యవహారంపై స్పందించని కేంద్రం.. తాజాగా తేల్చేసింది.
రెండే మాటల్లో తేల్చేసిన కేంద్రం!
మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. ఏపీ మూడు రాజధానుల అంశాన్ని లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు. ఇందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘రాష్ట్ర పరిధిలో రాజధాని ఏక్కడ పెట్టుకోవాలనే అధికారం రాష్ట్రానికే ఉంటుంది. అందులో మా జోక్యం ఉండదు’ అని కేంద్రం తేల్చేసింది. ఇన్నిరోజులుగా నెలకొన్న ధర్నాలు, రాస్తారోకోలకు కేంద్ర మంత్రి మాత్రం రెండే రెండు మాటల్లో తేల్చేశారు. కేంద్రం ఇచ్చిన సమాధానంతో టీడీపీ కంగుతింది. అంటే ఇది ఒకరకంగా చెప్పాలంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్ కాగా.. వైఎస్ జగన్‌కు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరీముఖ్యంగా ఈ రాజధానుల విషయమై టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన ఎంపీలు రోజుకో ప్రకటన చేశారు.. మరోవైపు పవన్ కల్యాణ్ సైతం గట్టిగానే హడావుడి చేశారు.. వీరంతా ఇప్పుడు ఏమంటారో ఏంటో!
సో.. కేంద్రం నుంచి జగన్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కనుక.. ఇక పనులు చకచకా చేయడమే తరువాయి అన్న మాట. మరి ఈ వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లు, ఏపీ కమలనాథులు ఎలా రియాక్ట్ అవుతారో మరి.