ఇక నుంచి ఆన్‌లైన్ ఛానల్స్‌పై కేంద్రం నిఘా.. అశ్లీలత కట్టడికి చర్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఓవర్ ది టాప్(ఓటిటి)లో పెరిగిపోతున్న అశ్లీలత కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఆన్‌లైన్ ఛానల్స్‌పై కేంద్రం నిఘా ఉండనుంది. ఇకపై కొత్తగా ఆన్‌లైన్ ఛానల్స్ ప్రారంభించాలంటే అనుమతి తీసుకోవల్సిందేనని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్ ఛానల్స్, ఓటీటీ కంటెంట్‌లను సమాచార శాఖ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సినిమా థియేటర్లు లేని లోటును ఓటీటీ తీరుస్తుండటంతో నెటిజన్లు లాక్‌డౌన్ సమయం నుంచి పూర్తిగా దీనిపై ఆధారపడ్డారు. వెబ్ సిరీస్‌లు మాత్రమేగాక కొత్త సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో ఓటీటీలకు మంచి క్రేజ్ ఏర్పడింది. సెన్సార్ కచ్చితంగా ఉండాలన్న డిమాండ్లు వస్తుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఓటీటీలో ప్రసార మయ్యే వెబ్ కంటెంట్‌ను కుటుంబ సభ్యులతో కలసి చూడగలిగే పరిస్థితి లేదని.. ఇందులో అసభ్యత అధికంగా ఉంటోందని గతంలో కేంద్రమంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలకు విరుద్దంగా ఈ వెబ్ కంటెంట్‌ను రూపొందిస్తున్నారని. నిర్వాహకులు వీటిపై స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా.. ఓటీటీల్లో ప్రసారమయ్యే వెబ్ కంటెంట్‌ను సెన్సార్‌షిప్ పరిధిలోకి తీసుకురావాలని గతంలో డిమాండ్ చేశారు. వెబ్ కంటెంట్‌ను చట్ట పరిధిలోకి తీసుకురావాలని.. నితీష్ కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
కాగా.. ఓటీటీల్లో పెద్ద ఎత్తున అభ్యంతరకర చిత్రాల ప్రదర్శన సాగుతోంది. సంచలన దర్శకులు రామ్‌గోపాల్‌వర్మ ఓటీటీని వేదికగా చేసుకుని బి, సి గ్రేడ్ చిత్రాల్ని రూపొందించి విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే కొందరు వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే చర్యలకు కూడా ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫారాన్ని పలువురు వినియోగించుకుంటున్నారు. కొందరు వ్యక్తుల జీవిత కథల్ని వక్రీకరించి ఈ ఫ్లాట్‌ఫారాలనే వేదికగా చేసుకుని విడుదల చేసేందుకు సమాయత్తమౌతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం చేపట్టిన చర్యలు హర్షణీయంగా ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్, ఓటీటీ కంటెంట్‌లను సమాచార శాఖ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకు రావడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments