పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. బాలుకు పద్మవిభూషణ్
Send us your feedback to audioarticles@vaarta.com
తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 2021కి గాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దానిలో ఐదుగురు తెలుగు వారికి పద్మాలు లభించడం విశేషం. అందులో తెలుగు జాతి గర్వించదగ్గ గాన గంధర్వుడు, వివిధ భాషల్లో దాదాపు 40వేల పాటలు ఆలపించిన సంగీతకారుడు.. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఉండటం మరింత విశేషం. ఆయనకు దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్ లభించడం తెలుగు జాతికి గర్వకారణం. ఇక గానకోకిల చిత్రకు పద్మభూషణ్ లభించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 120 మంది ప్రముఖులకు 119 పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. అయితే గుజరాత్‌కు చెందిన ఇద్దరు కళాకారులకు కలిపి ఒకటే పురస్కారాన్ని ప్రకటించింది. దీంతో మొత్తం అవార్డులు 119 అయ్యాయి.
మొత్తం 120 మందిలో ఏడుగురికి పద్మవిభూషణ్.. పది మందికి పద్మభూషణ్, 103 మందికి పద్మశ్రీ ప్రకటించింది. కాగా, ఈ జాబితాలో మొత్తం 29 మంది మహిళలు కాగా.. 10 మంది విదేశీయులు/ప్రవాస భారతీయులు/భారత మూలాలున్న వ్యక్తులు/ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కేటగిరీ చెందిన వారు. కాగా.. బాలు, పాసవాన్ సహా 16 మందికి మరణానంతర పురస్కారాలు ప్రకటించారు. పద్మవిభూషణ్ పురస్కారాలు లభించిన వారిలో బాలుతోపాటు.. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, వైద్య రంగంలో సేవలందించిన బెల్లె మోనప్ప హెగ్డే, నరీందర్ సింగ్ కపనీ (మరణానంతరం), మౌలానా వహీదుద్దీన్ ఖాన్ (ఆధ్యాత్మికం), బీబీ లాల్ (ఆర్కియాలజీ), సుదర్శన్ సాహు (ఆర్ట్) ఉన్నారు. పద్మభూషణ్ లభించిన 10 మందిలో కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార, అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ (మరణానంతరం), గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయి పటేల్ (మరణానంతరం), మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని కార్యాలయంలో గతంలో ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రా తదితరులు ఉన్నారు.
నలుగురు తెలుగు వారికి పద్మశ్రీ..
పద్మశ్రీ పురస్కారాలు లభించిన 103 మందిలో నలుగురు తెలుగువారున్నారు. వారిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు కాగా.. మిగిలిన ముగ్గురూ ఏపీకి చెందినవారు. తెలంగాణకు చెందిన ప్రముఖ గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు పద్మశ్రీ లభించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వాయులీన విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతీ రామమోహనరావు, అనంతపురానికి చెందిన సాహితీవేత్త, విద్యావేత్త ఆశావాది ప్రకాశ్‌రావు ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments