ఆ విజువల్‌ను ప్రదర్శించడమేంటి?: సెలబ్రిటీలు, నెటిజన్ల ఫైర్
- IndiaGlitz, [Tuesday,September 08 2020]
ప్రముఖులకు సంబంధించిన విషయాల్లో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడం కామన్‌గా జరుగుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీల మరణానికి సంబంధించిన విషయానికి వస్తే మీడియా అత్యుత్సాహం అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా చనిపోయిన వారి విజువల్స్ విషయంలో మీడయా వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. ప్రముఖ నటుడు జయప్రకాష్‌రెడ్డి(74) నేడు గుంటూరులో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణానికి సంబంధించిన విజువల్స్ విషయంలో మీడియా సంస్థలు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
జయప్రకాష్‌రెడ్డి బాత్‌రూమ్‌లో కుప్పకూలిపోయిన విజువల్స్‌ను చూపించడం పట్ల సెలబ్రిటీలతో పాటు.. నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాత్‌రూంలో కమోడ్ పక్కన ఆయన పడిపోయిన దృశ్యాలను చూపించడమేంటని మండిపడుతున్నారు. ఈ విషయమై ప్రముఖ డైరెక్టర్ మారుతి ట్వీట్ చేశారు. కొన్ని మీడియా సంస్థలు’ ప్రసారం చేస్తున్న జయప్రకాశ్ రెడ్డి గారి పార్థివ దేహం విజువల్స్ తీరు బాధాకరం. సమాజానికి తీరు తెన్నులు నిర్దేశించే సంస్థలు ఇలాంటి విషయాల్లో బాధ్యతాయుతమైన విధానాలు అవలంబిస్తే బాగుంటుంది మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు తప్పని కడ చూపుని అయినా గౌరవించాల్సిందిగా మనవి’’ అని మారుతి ట్వీట్‌లో పేర్కొన్నారు.
అయితే మీడియాకు ఇవేమీ కొత్త కాదు.. లెజెండరీ నటి శ్రీదేవి మరణ సమయంలోనూ ఇదే అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు ఆమె బాత్ టబ్‌లో ఎలా పడి పోయి మరణించారో సైతం కళ్లకు కట్టినట్టు ప్రయోగాత్మకంగా చూపించారు. ఆ సమయంలోనూ మీడియాపై విపరీతమైన విమర్శలొచ్చాయి. ఇటీవల మరణించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి విషయంలో కూడా ఆయన డెడ్ బాడీ విజువల్స్‌ను మీడియా బహిర్గతం చేసింది. ఇలా సెలబ్రిటీల మృతి విషయంలో మీడియా ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం వివాదాస్పదంగా మారుతోంది.