Kaikala SatyaNarayana : స్వర్గానికి నరకాధిపతి.. నవరస నటనా సార్వభౌముడికి ప్రముఖుల నివాళి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమ మరో మహానటుడిని పొగొట్టుకుంది. ఇప్పటికే కృష్ణ, కృష్ణంరాజుల మరణాలతో తీవ్ర దిగ్భ్రాంతిలో వున్న టాలీవుడ్‌కు మరో షాక్ తగిలింది. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్ధాల పాటు తన అసమాన నటనతో తెలుగువారిని అలరించిన కైకాల ఇక లేరన్న వార్తతో రెండు రాష్ట్రాల ప్రజలు విషాదంలో కూరుకుపోయారు. సత్యనారాయణ మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.
వెంకయ్య నాయుడు :
నవరస నటనా సార్వభౌముడిగా ప్రసిద్ధి గాంచిన కైకాల సత్యనారాయణ కన్నుమూశారని తెలిసి ఎంతో బాధపడ్డాను. మంచి నటన, వ్యక్తిత్వం వున్న సత్యనారాయణ జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనది
కేసీఆర్ :
తెలుగు చలన చిత్ర రంగంలో తొలి తరం నటుడిగా కైకాల విభిన్న పాత్రలు పోషించారు. తన అసమాన నటనతో మూడు తరాల తెలుగు ప్రేక్షకులను అలరించారు. సత్యనారాయణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా..
వైఎస్ జగన్:
గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
చంద్రబాబు:
విభిన్నపాత్రల్లో నటించి, తన విలక్షణ నటన ద్వారా అభిమానులచేత నవరసనటనాసార్వభౌమ అనిపించుకున్న మేటి నటులు, టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ గారి మరణం విచారకరం. సత్యనారాయణగారి ఆరు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్ గారితో ఆయనకున్న అనుబంధం సొంత అన్నదమ్ముల బంధం కన్నా ఎక్కువ. సత్యనారాయణగారి మరణం సినీరంగానికి తీరని లోటు. ఆయన ఆత్మ శాంతికై ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను
నందమూరి బాలకృష్ణ :
‘కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు. మా కుటుంబంతో కైకాల సత్యనారాయణ గారికి స్నేహ సంబంధాలు వున్నాయి. నాన్నగారితో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రవేశారు. సినీ జీవితంలోనూ, ప్రజాజీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’
తలసాని :
కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఎంపీగానూ సేవలందించారు. ఎన్టీఆర్ సైతం ఆయనను ఇష్టపడేవారు. ఏ పాత్ర పోషించినా అందులో లీనమైపోయేవారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments