CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ప్రముఖుల శుభాకాంక్షలు

  • IndiaGlitz, [Friday,December 08 2023]

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్‌తో పాటు ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు తమ అభినందనలు తెలియజేస్తున్నారు.

‘‘ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి అభినందనలు. రాష్ట్రాభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హమీ ఇస్తున్నా’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

“తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన మంత్రి వర్గ సహచరులకు శుభాభినందనలు. రేవంత్ గారితో నాకు వ్యక్తిగతంగా స్నేహం ఉంది. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత.. ఏ ఆశయాల కోసం ఆత్మబలిదానాలు చేసిందో వాటిని సంపూర్ణంగా నేరవేర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని, సార్థకతను కల్పించాలి’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ అభినందనలు. హమీల అమలు దిశగా ప్రభుత్వం పనిచేయాలని ఆకాంక్షిస్తున్నా’’అని మాజీ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. విజయవంతమైన పాలన అందించాలని కోరుకుంటున్నాను అని లోకేష్ ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంతరెడ్డి గారికి శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలియజేస్తు్‌న్నాను అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రిమండలికి తెలుగు చిత్ర పరిశ్రమ తరపున తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి తరపున హృదయపూర్వక అభినందనలు. మీ చైతన్యవంతమైన పాలనలో తెలంగాణ రాష్ట్రం మరింత ఉన్న శిఖరాలను సాధిస్తుందని విశ్వసిస్తున్నాం అని తెలుపుతూ ఓ ప్రకటనలో తెలిపారు .

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారికి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున శుభాభినందనలు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కనుగుణంగా ప్రభుత్వ పాలన సాగుతుందని విశ్వసిస్తున్నాం. ఇక అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పరిపాలన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. ప్రధానంగా జర్నలిస్టుల సంక్షేమం దిశగా ప్రభుత్వం ఆలోచించి.. ముందుకు సాగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అని ప్రకటన విడుదల చేసింది.