CEC:ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాత్రపై సీఈసీ కీలక ఆదేశాలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల సమయం ఆసన్నమైంది. మరో నెల లేదా నెలన్నర రోజుల్లో పోలింగ్ జరగనుంది. అయితే ఎన్నికల విధుల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వినియోగంపై అనుమానాలు నెలకొన్నాయి. వారిని వినియోగించుకోవాలని అధికార వైసీపీ భావిస్తుండగా.. పక్కనపెట్టాలని ప్రతపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. త్వరలో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వారి పాత్రపై స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల విధులకు వాలంటీర్లను కచ్చితంగా దూరం పెట్టాలని ఈసీ పేర్కొంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాలంటీర్లకు ఎన్నికల విధులను అప్పగించకూడదని. అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా కూడా అనుమతించవద్దని ఆదేశించింది. అలాగే బీఎల్‌వోలుగా పనిచేసిన సిబ్బందిని కూడా ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని సూచించింది. అయితే వారికి ఇతర పనులు అప్పగించాలని తెలిపింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఎన్నికల సమయంలో ఏ విధులు నిర్వర్తించాలన్న అంశంపై కూడా స్పష్టత ఇచ్చింది. వారికి ముఖ్యమైన ఎన్నికల పనులు కేటాయించకూడదని, ఓటు వేసిన వారికి సిరా గుర్తు పెట్టడం వంటి విధులను మాత్రమే కేటాయించాలని పేర్కొంది. ఒక పోలింగ్ బూత్‌కు సంబంధించిన ఎన్నికల బృందంతో ఒకరికి మించి సచివాలయ సిబ్బంది ఉండకూడదని వివరించింది. ఈ ఆదేశాలను ప్రతి జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు తప్పకుండా పాటించాలని వెల్లడించింది.
కాగా కొంతకాలంగా వాలంటీర్లు అధికార వైసీపీకి మద్దతుగా పనిచేస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల సొమ్ముతో జీతం చెల్లిస్తూ వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పలు మార్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదుచేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకపోతే పథకాలు రావంటూ వాలంటీర్లు బెదిరిస్తున్నారని కూడా తెలిపారు. అలాంటి వారికి ఎన్నికల విధులు అప్పగిస్తే వైసీపీకి మద్దతుగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల బృందం దృష్టికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తీసుకెళ్లారు. దీంతో వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout