Delhi Liquor Scam:ఆరోపణలు సరే.. ఆధారాలేవి, అసలు నేరం జరిగిందా : ఢిల్లీ లిక్కర్ స్కాంపై న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Monday,May 08 2023]

తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా దుమారం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నేరం జరిగినట్లుగా సీబీఐ ఎలాంటి ఆధారం లేదని సీబీఐ ప్రత్యేక కోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ప్రత్యేక కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎంకే నాగ్‌పాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో రూ.100 కోట్లు చేతులు మారినట్లుగా చేస్తున్న ఆరోపణలకు ఈడీ రుజువులు చూపలేకపోయిందని కోర్ట్ వ్యాఖ్యానించింది.

ఆధారాల గురించి ప్రశ్నించిన కోర్ట్ :

నేరం జరిగిందా లేదా అని చెప్పడానికి ఈడీ ఎలాంటి ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలను చూపలేకపోయిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు లంచాలు తీసుకుని గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని, ఇందులో రాజేశ్ జోషి ప్రమేయం వుందని ఈడీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జోషి కంపెనీ నుంచి ఎలాంటి నగదును స్వాధీనం చేసుకోలేదని కోర్ట్ పేర్కొంది. హవాలా మార్గంలో డబ్బు చేతులు మారిందని చెప్పడానికి కూడా సాక్ష్యాధారాలు లేవని న్యాయమూర్తి చెప్పారు. అటు వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రా విషయానికి వస్తే.. ఆయన లంచాలు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మద్యం అమ్మకాలను మరింత పెంచుకోవడానికి గౌతమ్.. కార్టెల్‌ను సృష్టించారని, అంతే తప్పించి మద్యం పాలసీ రూపకల్పనలో ఆయనకు ఎలాంటి ప్రమేయం లేదని కోర్ట్ వ్యాఖ్యానించింది.

శరత్ చంద్రారెడ్డికి బెయిల్ :

మరోవైపు.. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డికి సోమవారం ఊరట లభించింది. ఆయనకు ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. గతంలో శరత్ చంద్రారెడ్డి భార్య కనికా రెడ్డి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఇప్పుడు దానిని పూర్తి స్థాయి బెయిల్‌గా మార్చింది. లిక్కర్ స్కాంలో గతేడాది నవంబర్ 10న శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.