సీబీఐ దాడులతో వైసీపీ అభ్యర్థి రఘురాజు సతమతం!
- IndiaGlitz, [Tuesday,April 30 2019]
నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణం రాజుకు మంగళవారం సీబీఐ అధికారులు వరుస షాక్‌లిచ్చారు. మంగళవారం తెల్లవారు జామునుంచే అటు పశ్చిమ గోదావరిలోని ఇంటిపై.. ఇటు హైదరాబాద్‌లోని ఎమ్మార్ ప్రాపార్టిస్ విల్లా 74లో ఉన్న ఇంటిపై ఏకకాలంలో సోదాలు చేశారు. గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని.. వాటిని తిరిగి చెల్లించడంలో రఘురాజు కంపెనీలు విఫలమయ్యాయని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారమై బ్యాంకు అధికారులు గతంలోనే సీబీఐకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా ఈ సీబీఐ అధికారులందరూ బెంగళూరు నుంచి వచ్చారు. పలు బృందాలుగా విడిపోయి గోదావరి జిల్లాలోని ఇంటిపై, హైదరాబాద్‌లోని ఇంటిపై అధికారులు దాడులు చేశారు.
ఇళ్లే కాదు.. ఆఫీసులపై కూడా సోదాలు
మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రఘురాజు ఇళ్లపై దాడులు చేసిన అధికారులు మధ్యాహ్నం అటు హైదరాబాద్.. ఇటు పశ్చిమగోదావరి జిల్లాలోని ఆఫీసులలో కూడా అధికారులు సోదాలు జరుపుతున్నారు. అయితే ఇంత వరకు రఘురాంకు చెందిన ఇళ్లలో, ఆఫీసుల్లో ఏమేం సేకరించారు..? ఏమైనా విలువైన పత్రాలు దొరికాయా..? అనే విషయం తెలియరాలేదు. అయితే ఈ సోదాల వ్యవహారంపై రఘురాజు కానీ.. అధికారులు ఎలాంటి ప్రకటన కానీ.. కనీసం మీడియాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కాగా సోదాలు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు అధికారులు మీడియాకు వెల్లడిస్తారని తెలుస్తోంది.