గోడ దూకి మరీ చిదంబరంను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
- IndiaGlitz, [Thursday,August 22 2019]
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరంను నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి 9:50 గంటలకు ఢిల్లీలోని జోర్‌బాగ్‌లో ఉన్న నివాసంలో చిదంబరాన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతరం సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించడం జరిగింది. కాగా.. ఈ అరెస్ట్‌కు ముందు చిదంబరం నివాసం వద్ద పెద్ద హైడ్రామానే జరిగింది. కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత చిదంబరం తన నివాసానికి చేరుకున్నారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన సుమారు 15 నుంచి 20 మంది సీబీఐ అధికారులు చిదంబరం నివాసానికి వచ్చారు. ఈడీ, సీబీఐ అధికారులు అక్కడికి చేరుకుని ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. చిదంబరం వ్యక్తిగత సిబ్బంది, కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతేకాదు.. అధికారులు లోనికి రాకుండా గేట్లన్నీ మూసేశారు. దీంతో చేసేదేమీ లేక సీబీఐ అధికారులు గోడ దూకి మరీ ఇంట్లోకి ప్రవేశించి చిదంబరాన్ని అదుపులోకి తీసుకొని వాహనంలో తీసుకెళ్లారు.
అడ్డుకున్న కార్యకర్తలు!
మరోవైపు... చిదంబరాన్ని అరెస్టు చేయబోతున్నారనే వార్తలతో ఆయన నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. సీబీఐ అధికారులు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. సీబీఐ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో చిదంబరం అరెస్ట్ కోసం సీబీఐ అధికారులు.. ఢిల్లీ పోలీసుల సహకారం కూడా తీసుకున్నారు.
ఎదురుదెబ్బ!
ఇదిలా ఉంటే.. మంగళవారం నాడు ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం విదితమే. ఆ తర్వాత సుప్రీం కోర్టులో కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగలడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత బుధవారం రాత్రి చిదంబరం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమవ్వడం... ఆ తర్వాత సీబీఐ, ఈడీ అధికారులు రంగంలోకి దిగి అరెస్ట్ చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి.
ప్రెస్‌మీట్‌లో చిదంబరం ఏం చెప్పారు..!?
నాపై సీబీఐ, ఈడీకి చెందిన ఎలాంటి కేసులూ లేవు. నేను ఎలాంటి నేరం చేయలేదు. సీబీఐ, ఈడీ నుంచి ఎలాంటి ఛార్జ్‌షీట్ నాపై లేదు. ఈ అంశంలో నాతో పాటు కుమారుడిపైనా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా రాజకీయ ప్రేరేపితమేనని.. కక్ష సాధింపు చర్యలు తప్ప మరొకటి కాదు. ఎఫ్‌ఐఆర్ నమోదైనంత మాత్రాన ఎవరూ నేరస్థుడు కాదు. ఏడాదిన్నర పాటు మధ్యంతర బెయిల్‌పై ఉన్నాను. గత 24 గంటల్లో చాలా జరిగింది. ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా ఉందని నేను నమ్ముతున్నాను. చట్టాన్ని నేను గౌరవిస్తాను.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటాను అని అరెస్ట్ వ్యవహారానికి ముందు మీడియా మీట్‌లో చిదంబరం చెప్పుకొచ్చారు