కోర్టులో సీఎం జగన్‌కు చుక్కెదురు!
- IndiaGlitz, [Friday,January 24 2020]
సీబీఐ, ఈడీ కోర్టుల్లో ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి చుక్కెదురైంది. తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విషయమై ప్రతి శుక్రవారం వైఎస్ జగన్.. అమరావతి నుంచి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు వచ్చి హాజరవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. సీబీఐ, ఈడీ కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు జగన్ తరఫు న్యాయవాది వేసిన పిటిషన్లపై ఇవాళ న్యాయస్థానం విచారణ జరిపింది. తన బదులు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. అయితే ఈ అభ్యర్థనను న్యాయస్థానం కొట్టి వేసింది. అంతేకాదు.. ఆయా కేసుల్లో జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదని కోర్టు తేల్చిచెప్పింది. దీంతో ఈడీ కేసులో ఇకనుంచి జగన్ కోర్టుకు హాజరుకాక తప్పనిపరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉంటే.. కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తే ఈ కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు ఈడీ అధికారులు నిశితంగా వివరించారు. ఇదివరకు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్.. ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్నారని అలాంటి వ్యక్తికి మినహాయింపు ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాదులు.. కోర్టుకు దృష్టికి రావడంతో.. జగన్ తరఫు న్యాయవాది వేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. దీంతో జగన్‌కు మరోసారి చుక్కెదురైనట్లయ్యింది. సో.. ఇకపై కూడా ప్రతి శుక్రవారం జగన్ సీబీఐ కేసులతో పాటు.. ఈడీ కేసులకు కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనన్న మాట.