CBI Court :జగన్ , విజయసాయిరెడ్డిలకు ఊరట.. విదేశీ పర్యటనకు సీబీఐ కోర్ట్ గ్రీన్ సిగ్నల్

  • IndiaGlitz, [Friday,September 01 2023]

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలకు కోర్టులో ఊరట లభించింది. వీరిద్దరూ విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణ జరిపిన సీబీఐ న్యాయస్థానం గురువారం తుది తీర్పు వెలువరించింది. జగన్, విజయసాయిరెడ్డిలు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. వీరిద్దరి విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ.. న్యాయస్థానంలో వాదనలు వినిపించింది. విదేశీ టూర్‌కు అనుమతిస్తే సాక్షులను వీరు ప్రభావితం చేసే అవకాశం వుందని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే న్యాయస్థానం నుంచి జగన్, విజయసాయిరెడ్డిలకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

కాగా.. సీఎం వైఎస్ జగన్ లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తెను చూసేందుకు యూకే వెళ్లనున్నారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు ఆయన యూకేలో పర్యటిస్తారు. అటు ఎంపీ విజయసాయిరెడ్డి విషయానికి వస్తే.. విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లనున్నారు.

జగన్ అక్రమాస్తుల కేసులో వీరిద్దరూ ఏ1, ఏ2గా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గతంలో సీబీఐ వీరిని అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై బయటకొచ్చారు. అయితే బెయిల్ షరతుల్లో పాస్‌పోర్ట్‌ను న్యాయస్థానానికి సమర్పించాలని.. కోర్ట్ అనుమతితోనే విదేశీ పర్యటనలకు వెళ్లాలన్న షరతులు వున్నాయి. ఈ నేపథ్యంలో జగన్, విజయసాయిరెడ్డిలు కోర్ట్ అనుమతితోనే విదేశాలకు వెళ్తున్నారు. తాజాగా ఇప్పుడు మరోసారి న్యాయస్థానం అనుమతి కోసం పిటిషన్ దాఖలు చేశారు.