Telangana Assembly:తెలంగాణ అసెంబ్లీలో కులగణన తీర్మానం.. స్వాగతించిన బీఆర్ఎస్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానం ప్రవేశపెట్టడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమని కొనియాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేస్తున్నామని చెప్పారు. ఈ సర్వే సర్వరోగ నివారిణిలా ఉంటుందని.. ప్రతి ఇంటిని, కులాన్ని సర్వే చేసి ప్రజల ఆర్థికస్థితి గతులు తెలుసుకుంటామని పేర్కొన్నారు. దేశంలోని సంపద, రాజ్యాధికారం జనాభా దామాషా ప్రకారం దక్కాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కులగణనతో పాటు సోషల్, ఎకానమిక్, ఎడ్యుకేషన్, పొలిటికల్, ఎంప్లాయిమెంట్ అంశాలపై కూడా సర్వే చేస్తామని వివరించారు.
అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని తాము స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టత లేదని.. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. జనం, కులం అంటూ ద్వంద్వ వైఖరి కనిపిస్తోందని.. జనగణన చేసే హక్కు రాష్ట్రాలకు లేదని.. కులగణన మాత్రమే చేసే హక్కు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎలాంటి చట్ట బద్ధత లేకుండా తీర్మానం పెడితే లాభం ఉండదని సూచించారు. కులగణన చేపట్టిన ఆయా రాష్ట్రాలు న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయని కడియం గర్తు చేశారు. దీనిపై మంత్రి పొన్నం సమాధానమిచ్చారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. ప్రతిపక్షాలకున్న సందేహాలు నివృత్తి చేసే బాధ్యత తమదే అని స్పష్టం చేశారు. ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వొచ్చని తెలిపారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని.. అయితే పకడ్బందీగా నిర్వహించాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వానికి సూచించారు. తీర్మానం కాదు చట్టం చేయాలని అన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని.. బీసీ సబ్ ప్లాన్ వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీహార్లో ఇప్పటికే కులగణన చేశారని కానీ న్యాయపరమైన చిక్కులు వచ్చాయని గుర్తుచేశారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కుల గణనపై అనుమానాలొద్దని, చట్ట సభల్లో అన్ని కులాలకు న్యాయం చేసేందుకే కులగణన చేపడుతున్నామని తెలిపారు. కుల గణనపై ప్రజలకు అనుమానం లేవనెత్తేలా విపక్షాల వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. సమగ్ర కుటుంబ సర్వే చేశామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటుందని, బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే సభలో ప్రవేశపెట్టారా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే ఆ సర్వే వివరాలను వాడుకుందని ఆరోపించారు. కుల గణన తీర్మానంపై అనుమానం ఉంటే సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులకు సూచించారు. బాధితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని రేవంత్ స్పష్టంచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments