జగన్ ఫ్యామిలీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేసులు!!
- IndiaGlitz, [Monday,January 06 2020]
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబాన్ని నాటి నుంచి నేటి వరకూ కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. వైఎస్ జగన్ సీఎం అయినప్పటికీ మినహాయింపేమీ లేదని కేసులు మాత్రం నడుస్తూనే ఉన్నాయ్.. నిన్న మొన్నటి వరకూ అక్రమాస్తుల కేసులో తనకు హాజరు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరినప్పటికీ.. సమస్యే లేదు.. తప్పకుండా ప్రతి శుక్రవారం హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ షాక్ ఇటీవలే కోర్టు ఇచ్చింది.
విజయమ్మ, షర్మిలకు నోటీసులు!
అయితే సీబీఐ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోక మునుపే.. వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిలకు హైదరాబాదులోని ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీచేసింది. ఈ నెల 10న హాజరుకావాలని ప్రత్యేక కోర్టు సమన్లలో పేర్కొంది. వీరిద్దరితో పాటు నాటి మంత్రి కొండా సురేఖ, కొండా మురళికి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.
అసలేం జరిగింది!?
గతంలో పరకాలలో ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించరని.. ఇది ఎన్నికల కోడ్ ఉల్లఘించినట్లేనని 2012లో పరకాల పీఎస్‌లో కేసు నమోదైంది. ఆ కేసును తిరగతోడిన కోర్టు.. తాజాగా సమన్లు ఇచ్చి వివరణ ఇవ్వాలని కోరింది. మరి కోర్టుకు ఇచ్చే వివరణ ఎలా ఉంటంది..? ఏంటి పరిస్థితి అనేది తెలియాల్సి ఉంది.
అదే రోజు కోర్టుకు జగన్!
ఇవన్నీ ఒక ఎత్తయితే విజయమ్మ, షర్మిళ అటు పరకాల కోర్టుకు 10న వెళ్లాల్సి ఉండగా.. అదే రోజున శుక్రవారం కావడంతో సీఎం వైఎస్ జగన్ కూడా అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరు కానున్నారు.
ఇదిలా ఉంటే.. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పటికీ ఇలా వరుస కేసులు వైఎస్ ఫ్యామిలీని వెంటాడుతుండటంతో వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది. అసలేం జరుగుతోందనేది తెలియక వైసీపీ కార్యకర్తలు తికమక పడుతున్నారట. ఇప్పటికే రాజధాని తరలింపు.. రాజధాని రైతుల ఆందోళనతో పాటు పలు విషయాలతో టెన్షన్‌గా ఉన్న వైఎస్ జగన్‌కు తాజాగా అమ్మ, చెల్లికి నోటీసులు ఇవ్వడంతో ఒకింత ఆందోళన మొదలైందని తెలుస్తోంది. మరోవైపు.. జగన్ ఫ్యామిలీపై కేసులు ప్రారంభమయ్యాయి.. ఇక ఉక్కిరిబిక్కిరేనని టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయట.