రఘురామ కృష్ణరాజుపై వరుస కేసులు.. దారిలోకి తెచ్చే యత్నం!
- IndiaGlitz, [Friday,July 10 2020]
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును దారిలోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన తన సొంత పార్టీకే ఎదురు తిరిగిన విషయం తెలిసిందే. అధిష్టానం షో కాజ్ నోటీసు ఇచ్చినప్పటికీ ఆయన ఏమాత్రం లొంగలేదు. పైగా తనకు రక్షణ కల్పించాలంటూ లోక్‌సభ స్పీకర్‌ను కలిశారు. అనంతరం తనకు కలిసేందుకు అవకాశమివ్వాలని కోరినప్పటికీ జగన్ ఏమాత్రం స్పందించలేదు. రెండు సార్లు రఘురామ కృష్ణరాజు లేఖ రాసినా ఫలితం శూన్యం. అయితే రఘురామ కృష్ణరాజు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఆయనను దారిలోకి తెచ్చేందుకు అధిష్టానం ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆయనపై వరుస కేసులు నమోదవుతున్నాయి.
మొదట రఘురామ కృష్ణరాజుపై మంత్రి రంగనాథరాజు ఫిర్యాదు చేయగా.. అనంతరం వరుసగా.. తణుకు, భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం రఘురామ కృష్ణరాజుపై కేసు నమోదు చేయలేదు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తరువాతనే కేసుల నమోదు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కాగా.. తనపై నమోదవుతున్న వరుస కేసులపై మాత్రం ఇప్పటి వరకూ రఘురామ కృష్ణరాజు పెదవి విప్పలేదు. దీంతో అధిష్టానం భావించినట్టు ఆయన దారికొస్తారా? లేదంటే వ్యూహాత్మకంగా ముందుకెళతారా? వేచి చూడాలి.