'మిస్టర్ పర్ ఫెక్ట్' ... దిల్ రాజుపై కేసు నమోదు
- IndiaGlitz, [Sunday,September 17 2017]
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీస్తూ హిట్ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు దిల్రాజు. డిస్ట్రిబ్యూటర్గా సినిమా రంగంలోకి ప్రవేశించిన ఆయన ప్రస్తుతం సక్సెస్ఫుల్ నిర్మాతగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల ఆయన రూపొందించిన 'ఫిదా' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇదిలా ఉండగా, దిల్రాజు నిర్మించిన 'మిస్టర్ పర్ఫెక్ట్' కథ తనదేనంటూ ఓ రచయిత్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.
ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో 2011లో ఈ సినిమా విడుదలైంది. అయితే 2010లో హితి పబ్లిషర్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించారు. తన నవలలోని పాతికకు పైగా సీన్లు ఈ సినిమాలో ఉన్నట్టు రచయిత్రి ముమ్మిడి శ్యామలా రాణి తెలిపారు. 'నా మనసు కోరింది నిన్నే' పేరుతో తాను 2006లో ఈ నవలను రాసినట్టు తెలిపారు. టీవీలో సినిమా చూస్తుంటే అది తన నవల ఆధారంగా తీసిన చిత్రమని అర్థమైందని, భవిష్యత్తులో ఈ సినిమాను మరే భాషలో రీమేక్ చేసినా, తన పేరు అందులో తప్పకుండా ప్రచురించాలని ఆమె కోరారు. ప్రస్తుతం నిర్మాత దిల్రాజు, దర్శకుడు దశరథ్పై సెక్షన్ 120ఎ, 415, 420తో పాటు కాపీ రైట్ యాక్ట్ సెక్షన్ 63 కింద కూడా కేసు నమోదు చేయించారు. దీనికి దిల్రాజు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.