బిగ్‌బాస్ ఫేం కత్తి కార్తీకపై కేసు నమోదు..
- IndiaGlitz, [Saturday,October 17 2020]
బిగ్‌బాస్ ఫేం, ప్రముఖ యాంకర్ కత్తి కార్తీకపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 52 ఎకరాల స్థలాన్ని రూ.35 కోట్లకు ఇప్పిస్తానని కోటి రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకుని కత్తి కార్తీకతో పాటు మరో ఆరుగురు మోసానికి పాల్పడ్డారంటూ ఆరుగురిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్-10లో టచ్ స్టోన్ ప్రాపర్టీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను దొరస్వామి అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. దొరస్వామికి టీమ్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ ఎండీ శ్రీధర్‌కు మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలోనే తమ సంస్థను విస్తరించనున్నానని.. నగర శివారులో భూమి కావాలని శ్రీధర్‌కు దొరస్వామి చెప్పారు.
ఈ నేపథ్యంలో కత్తి కార్తీక నిర్వహిస్తున్న కార్తీక్ గ్రూప్‌తో పాటు పలువురు వ్యాపారులు తనకు తెలుసని.. దొరస్వామికి శ్రీధర్ తెలిపారు. దీంతో దొరస్వామి, శ్రీధర్‌తో కలిసి వెళ్లి ఈ ఏడాది ఏప్రిల్‌లో కార్తీకతో పాటు నువ్వాల శివరాంప్రసాద్, తెన్నేరి భీమ్‌సేన్ అనే వ్యక్తులను కలిసి స్థలం కావాలని చెప్పారు. కాగా.. మెదక్ జిల్లా అమీన్‌పూర్ గ్రామంలో స్థలం ఉందని.. ఆ స్థలంలో కొంత భాగం తమదేనని.. మిగతా స్థలం తాలూకు పత్రాలు, జీపీఏ హక్కులు తమ వద్దనే ఉన్నాయని కత్తి కార్తీక బృందం దొరస్వామికి చెప్పింది. దీంతో 52 ఎకరాలను రూ.35 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుని దొరస్వామి నుంచి రూ.కోటి అడ్వాన్స్‌గా తీసుకుంది.
అడ్వాన్స్ చెల్లించిన అనంతరం దొరస్వామి ఎంక్వైరీ చేయగా.. తనకు అమ్మేందుకు ఒప్పందం చేసుకున్న స్థలం సిప్లా రమేష్ అనే వ్యక్తిదని తేలింది. స్థలం కొనుగోలు వ్యవహారాన్ని రమేష్ దృష్టికి దొరస్వామి తీసుకెళ్లారు. స్థలంపై కత్తి కార్తీక బృందంతో జరిగిన ఒప్పందం గురించి కూడా వివరించారు. దీంతో తాను ఎవ్వరికీ జీపీఏ హక్కులు ఇవ్వలేదని రమేష్ చెప్పడంతో దొరస్వామి షాకయ్యారు. మోసపోయాలని గ్రహించిన దొరస్వామి కత్తి కార్తీక, శ్రీధర్ గోపిశెట్టి, నువ్వాల శివరాంప్రసాద్, మురళీకృష్ణ, తెన్నేరి భీమ్‌సేన్ తదితరులపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిపై ఐపీసీ 406, 420,120(బి), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.