సమ్మక్క- సారలమ్మలపై వ్యాఖ్యలు: చిక్కుల్లో చిన్నజీయర్ స్వామి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. ఆదివాసీల నిరసన
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ ఆధ్యాత్మిక గురు చినజీయర్ స్వామి చిక్కుల్లో పడ్డారు. ఆదివాసీల వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను కించపరిచేలా మాట్లాడిన చినజీయర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివాసీల ఆడబిడ్డల చరిత్ర తెలియని జీయర్‌స్వామికి వారి గురించి మాట్లాడే హక్కు లేదంటూ ఆదివాసీ నేతలు ఫైరయ్యారు.
కులపిచ్చితో జనాల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న చరిత్ర చినజీయర్‌దని ఆరోపించారు. అడవి బిడ్డలపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన జీయర్‌స్వామి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అటు చినజీయర్ వ్యాఖ్యలపై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా తల్లులది వ్యాపారమా?... మీరు సమాతామూర్తి విగ్రహం ఏర్పాటుతో చేసింది వ్యాపారమా అంటూ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదని.. కానీ మీరు పెట్టిన 120 కిలోల బంగారు సమతామూర్తి విగ్రహం చూడ్డానికి 150 రూపాయలు టికెట్ ధర పెట్టారంటూ ఆమె ఎద్దేవా చేశారు. సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదు అని సీతక్క ధ్వజమెత్తారు.
సమ్మక్క సారలమ్మ జాతరను కించపరుస్తూ చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మేడారంలో చిన్న జీయర్ స్వామి దిష్టిబొమ్మను ఆదివాసీ నేతలు దగ్ధం చేశారు. చిన్న జీయర్ స్వామి చిత్రపటానికి చెప్పుల దండలు వేసి ఆదివాసీ గిరిజనులు తమ నిరసనను తెలియజేశారు. అగ్రకులాల అహంకారాన్ని ప్రదర్శిస్తూ జీయర్ స్వామి వ్యాఖ్యలు చేశారని .. తక్షణం ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments