YCP MLA:ఈవీఎం ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యేపై కేసు.. అరెస్ట్ చేసే అవకాశం..

  • IndiaGlitz, [Wednesday,May 22 2024]

ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఘర్షణలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే మాచర్ల నియోజకవర్గంలో ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేయడం సంచలనంగా మారింది. రెంటచింతల మండలం పాల్వాయి గేటు గ్రామంలోని 202 పోలింగ్ కేంద్రంలోకి అడుగుపెట్టిన పిన్నెల్లి.. నేరుగా ఈవీఎం మిషన్ వద్దకు వెళ్లి దానిని నేలకేసి కొట్టారు. వీవీ ప్యాట్ కూడా విసిరేశారు. ఈ దృశ్యాలన్నీ వెబ్ క్యాస్టింగ్ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దీంతో కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై సీరియస్ అయింది. ఆయనతో పాటు అనుచరులపై కేసు నమోదుచేయాలని పోలీసులను ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో ఆయనపై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి అరెస్ట్ తప్పదని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆయన హైదరాబాద్ వెళ్లి తలదాచుకున్నారు. మాచర్లలో ఆయనను పోలింగ్ రోజు గృహనిర్భంధం చేసినప్పటికీ పోలీసుల కళ్లుగప్పి హైదరాబాద్ చేరుకోవడంపై కూడా ఈసీ సీరియస్ గా ఉంది. దీంతో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కౌంటింగ్ రోజు ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్తగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేస్తారని సమాచారం. ఆయనతో పాటు సోదరుడిని కూడా అదుపులోకి తీసుకోనున్నారట.

ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే మళ్లీ పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో అల్లర్లు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పిన్నెల్లి ప్రధాన అనుచరులను ముందస్తుగా అదుపులోకి తీసుకునే అవకాశముందని కూడా పోలీసు వర్గాలు అంటున్నాయి. మరోవైపు పల్నాడు జిల్లా అంతటా 144వ సెక్షన్ అమలులో ఉంది. జూన్ 5వ తేదీ వరకూ 144వ సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇప్పటకే ప్రకటించారు. ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే తలెత్తే పరిణామాలపై కూడా ఊహించి అందుకు అనుగుణంగా పోలీసు యంత్రాంగం చర్యలకు దిగింది.

ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో చెలరేగిన అల్లర్లు, హింసపై ఏర్పాటు చేసిన సిట్ టీమ్.. తిరుపతి, అనంతపురం, పల్నాడు, జిల్లాల్లో 33 ఘటనలు నమోదైనట్లు గుర్తించింది. సిట్ ప్రాథమిక నివేదిక ప్రకారం పోలింగ్ హింసపై 33 కేసులు నమోదు కాగా, మొత్తం నిందితులు 1370 మంది ఉన్నారు. మొత్తం 33 కేసులు నమోదు కాగా, అందులో అధికంగా పల్నాడు జిల్లాలో 22 కేసులు, అనంతపురంలో 7, తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదు అయినట్లు సిట్ పేర్కొంది. ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసినా కొందరు పోలీసులు, అధికారులు నిర్లక్ష్యం చేశారని సిట్ బృందం పేర్కొంది.