క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడికి ఏడాది: జనవరి 6న జాతినుద్దేశించి ప్రసంగించనున్న బైడెన్, ట్రంప్
- IndiaGlitz, [Tuesday,January 04 2022]
అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచిపోయిన క్యాపిటల్ భవనంపై దాడి ఘటనకు అప్పుడే ఏడాది కావొస్తోంది. ఈ నేపథ్యంలో వార్షికోత్సవానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ జాతినుద్దేశించి వేర్వేరుగా ప్రసంగించనున్నారు. బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లు క్యాపిటల్ బిల్డింగ్ లోపల నుంచి మాట్లాడతారని వైట్‌హౌస్ వర్గాలు అంటున్నాయి.
సరిగ్గా ఇదే సమయంలో ట్రంప్... ఫ్లోరిడాలోని మార్ ఏ లాగోలోని తన రిసార్ట్ నుంచి విలేకరులతో మాట్లాడనున్నారు. ఆయన ఏం చెప్పనున్నారన్నది ఊహించడం పెద్ద కష్టం కాదు.. బైడెన్‌పై ఏడు మిలియన్లకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయి, దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో దావాలు ఓడిపోయినప్పటికీ 2020 ఎన్నికల్లో కుట్ర జరిగిందన్న వాదనను ట్రంప్ నేటికీ కొనసాగిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ నుంచి కోవిడ్ 19 వరకు ప్రతిదానిని సాకుగా చూపుతూ బైడెన్‌పై విస్తృత దాడి చేస్తున్నారు ట్రంప్. ఏ మాజీ అధ్యక్షుడూ తన స్థానంలోకి రానున్న కొత్త దేశాధినేత విషయంలో ఇలా ప్రవర్తించలేదని, ప్రజాస్వామ్య ప్రక్రియను కూడా అప్రతిష్టపాలు చేసేందుకు ఇంతగా ప్రయత్నించలేదని అమెరికన్ ప్రజాస్వామ్యవాదులు ఇప్పటికీ ట్రంప్‌ను తూర్పారబడుతూనే వుంటారు.
కాగా.. అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ నేత జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం 2020 జనవరి 6 న యూఎస్ కాంగ్రెస్.. క్యాపిటల్ భవనంలో సమావేశమైంది. ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.. భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు. బారికేడ్లను దాటుకుని వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు. వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ ఘటనకు సంబంధించి ఎన్నో విచారణ కమీటీలు దర్యాప్తు చేస్తున్నాయి.
ఈ దుశ్చర్యకు సంబంధించి అమెరికా న్యాయశాఖ దాదాపు 700 మందిపై అభియోగాలు మోపింది. ఈ దాడిపై దర్యాప్తు చేస్తున్న హౌస్ సెలక్ట్ కమిటీ వచ్చే వేసవి నాటికి ప్రాథమిక నివేదికను అందించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచరులు, మద్ధతుదారులను విచారించింది.