KTR:నా వెంట్రుక కూడా పీకలేరు.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్..
- IndiaGlitz, [Tuesday,March 05 2024]
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం వేడెక్కిస్తున్నారు. తాజాగా సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ పార్లమెంటరీ సమావేశంలో కేటీఆర్.. నా వెంట్రుక పీకలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుపెడితే సిరిసిల్లలో ఉన్న కేకే మహేందర్ రెడ్డి వరకు అందరూ దగుల్బాజీలు, సన్నాసులు, చేతకాని వెధవలే. నియోజకవర్గంలో మంజూరైన రూ. 14 కోట్ల రోడ్డు రద్దు చేశారు. మంజూరైన రోడ్డును రద్దు చేయటం కాదు.. దమ్ముంటే, చేతనైతే ప్రజల మనసు గెలుచుకోవాలి. దుబ్బాక నుంచి ముస్తాబాద్ వరకు నేను రెండు లైన్ల రోడ్డు మంజూరు చేశాను. చేతనైతే ఆ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మార్చి ప్రజల మనసును గెలుచుకోవాలి. నా మీద కోపంతో సిరిసిల్ల నేతన్నల కొంపముంచే ప్రయత్నం చేస్తున్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేశారు.
కేసీఆర్ మీద కోపంతో చిల్లర రాజకీయం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు వృథా అని ప్రచారం చేస్తున్నారు. ప్రాజెక్టులో ఒక బుంగ పడితే దానిని పుడ్చకుండా వానాకాలం వరకు నానబెట్టి ప్రాజెక్టు కొట్టుకుపోయేటట్టు చేయాలని, రైతులకు నీళ్లు ఇవ్వొద్దని, కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం దివాళాకోరు, దగుల్బాజీ రాజకీయం చేస్తోంది. ఈ మాటలకు నాపై కేసు పెట్టుకుంటే పెట్టుకోండి.. నా వెంట్రుక కూడా పీకలేరు. కేసులకు, జైళ్లకు భయపడేది లేదు.. నిత్యం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు, నేతన్నలను ఆదుకున్నామని.. కాంగ్రెస్ హామీ ఇచ్చిన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయలేదు.. రైతుబంధు వేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు కూడా గెలవదంటూ జోస్యం చెబుతున్నారు. మొత్తానికి లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా జరగుతున్నాయి.