Greater Hyderabad:ఒంటిరిగా గ్రేటర్ హైదరాబాద్ అభ్యర్థులు.. కీలక నేతల కోసం ఎదురుచూపులు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం తుది దశకు చేరింది. అన్ని పార్టీల నేతలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం కీలక నేతల పర్యటనలు సాగడం లేదు. దీంతో ఇక్కడి అభ్యర్థులు తమకు అండగా నిలిచే నేతల కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కొంతమంది నాయకులు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేసేవారు. తమ నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేసి అభ్యర్థులు గెలిపించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది.
ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ పరిధిలో ప్రచారం కీలక నేతల ఎవరూ లేరు. కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు మీదనే ఆధారపడి ఉన్నారు. కానీ వారు రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సి రావడంతో ఇక్కడ గ్యాప్ ఏర్పడింది. కీలక నేతగా ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమన్వయ బాధ్యతలు కూడా పార్టీ అప్పగించింది. ఇక్కడ దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత పోటీ చేస్తున్నారు. తలసాని ప్రచారానికి రాకపోవడంతో ఆమె ఒక్కరే ప్రచారం చేసుకుంటున్నారు. ఇక మరో ఇద్దరు మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. దీంతో నగరంలోని గులాబీ పార్టీ అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ పెద్దదిక్కులా మారారు. ఆయన నగరంలో రోడ్‌షోలు నిర్వహించాలని కోరుకుంటున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, పి.జనార్దన్‌రెడ్డి లాంటి అగ్రనేతలు హైదరాబాద్‌లో పార్టీని ఒంటి చేత్తో ముందుకు నడిపించారు. పార్టీ అభ్యర్థులకు అన్నీ తామై వ్యవహరించేవారు. ప్రస్తుతం అలాంటి నేత ఎవరు కనపడటం లేదు. నగరాన్ని పూర్తిగా ప్రభావితం చేసే నేతలు తమ పార్టీలో కనిపించడం లేదని సొంత పార్టీ నేతలే బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో గ్రేటర్ నియోజకవర్గాల్లో పోటీలో దిగిన అభ్యర్థులు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లాంటి నేతలు ప్రచారం చేయాలని కోరుతున్నారు.
అటు నగరంలో బీజేపీకి ఒకప్పుడు దివంగత ఆలె నరేంద్ర పెద్ద దిక్కుగా ఉండేవారు. పాతబస్తీలో పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేశారు. ఆయన మరణానంతరం ఇంతవరకు అలాంటి మాస్ ఇమేజ్ నేతలు కాషాయం పార్టీలో కనిపించడం లేదు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నా ఆయన ఇతర నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ లాంటి నాయకులు తమ నియోజకవర్గాల్లో పర్యటించాలని కమలం అభ్యర్థులు కోరుతున్నారు. మొత్తానికి కీలక నేతల ప్రచారం కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని పార్టీల నేతలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments