పులివెందుల వెళ్లి ఎకరం భూమి కొనగలరా..?
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన 12 నెలల్లో ఆమదాలవలస-రాజాం నియోజకవర్గాల మధ్య నాగావళి నదిపై బలసలరేవు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. జనసేన ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధికారంలోకి రాగానే పొందూరు ఖద్దరుకు పూర్వ వైభవం తెస్తామన్నారు. దేశ వ్యాప్త మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం ద్వారా పొందూరు ఖద్దరుని అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు.
పులివెందుల వెళ్లి ఒక్క ఎకరం భూమి కొనగలరా.?
‘ఉత్తరాంధ్రలో చాలా బీల నేలలు ఉన్నాయి. ఈ భూములపై కొందరి కన్ను పడింది. ఉత్తరాంధ్ర భూముల్ని అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత జనసేనపై ఉంది. ఇక్కడ రైతులు భూములు అమ్ముకుపోతున్నారు. ఎక్కడి నుంచో వచ్చి వేలకు వేల ఎకరాల భూములు కొనేస్తున్నారు. భూములు ఉపాధి అవకాశాలు వచ్చే పరిశ్రమలకు అమ్ముకుంటే ఫర్వాలేదు. పులివెందుల నుంచి సంచులు తీసుకువచ్చి కొనుగోళ్లు చేసే వారి వల్ల ఆ అవకాశం కూడా లేదు. అంతెందుకు పులివెందుల వెళ్లి ఒక్క ఎకరం భూమి కొనగలరా.? మన నేలకి వచ్చి మన భూముల్ని బొక్కేస్తుంటే.. మనల్ని తొక్కేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా.? శ్రీకాకుళం అంటే పోరాటాల గడ్డ. థర్మల్ వ్యతిరేక ఉద్యమం జరిగితే పోలీస్ కాల్పుల్లో బుల్లెట్ చీలమండలో దిగినా వెనక్కి తగ్గని మనుషులు ఉన్న నేల. బుల్లెట్ గుండెల్లో దిగినా నా భూములు మాత్రం ఇవ్వమన్న రైతు పుట్టిన గడ్డ. ఈ నేలలో అంత తెగింపు ఉంది" అని పవన్ చెప్పుకొచ్చారు.
పెన్ఫన్ ఇస్తాం..
"58 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పెన్షన్ సదుపాయం కల్పిస్తాం. మత్య్సకారులకు 300 రోజుల పాటు ఉపాధి కల్పిస్తాం. వేట నిషేధం సమయాల్లో రోజుకి రూ. 500 చొప్పున భృతి కల్పిస్తాం. ప్రభుత్వ ప్రవేశ పరీక్షలకు ఏడాదికి ఒక్కసారే దరఖాస్తు ఫీజు చెల్లించే ఏర్పాటు చేస్తాం. యువతకి ఆరు నుంచి 9 నెలల ట్రైనింగ్ ఇచ్చి 25 వేల స్పెషల్ పోలీస్ కమాండో ఉద్యోగాల్లో నియమిస్తాం. అధికారంలోకి రాగానే మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయిస్తాం" అని పవన్ తెలిపారు.
ఉత్తరాంధ్ర గౌరవాన్ని నిలుపుతాం..
"తిత్లీ తుపాను వచ్చి ప్రజలు ఇబ్బందిపడుతుంటే ప్రతిపక్ష నేత విజయనగరంలో తిరుగుతారా..? ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి పలుకరించాల్సిన బాధ్యత మీకు లేదా. విపత్తుల సమయంలో కూడా మా పాదయాత్రలు, దండాలు, ఓదార్పు యాత్రలే ముఖ్యం అంటే ఎలా..? ప్రతికూల పరిస్థితుల్లో మన కోసం నిలబడే వాడే అసలైన నాయకుడు. వైసీపీ నాయకులు వారి అవసరానికి ఇప్పుడు వస్తున్నారు. అటు టీడీపీ చూస్తే శ్రీకాకుళం చీకట్లో మగ్గుతుంటే అన్నీ పూర్తి చేశామని బయటికి చెప్పారు. మీకు అండగా ఉండేందుకు జనసేన పార్టీ వచ్చింది. మార్పు తెచ్చేందుకు, ఉత్తరాంధ్రకు ఉద్యోగాలు తెచ్చేందుకు, ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టే మార్పు కోసం జనసేన ఉంది. బడ్జెట్ రెండు లక్షల కోట్లు ఉంటే 5 లక్షల కోట్ల హామీలు ఇస్తున్నారు. నేను ఏది చెప్పినా ప్రాక్టికల్‌గా చెబుతా. శ్రీకాకుళం రాజకీయాలు మారాలి. నేను బలమైన మార్పు కోసం వచ్చాను. పార్టీ పెట్టాను. మార్పు జనసేనతోనే సాధ్యం. మార్పు కోరుకునే ప్రతి ఒక్కరు జనసేన అభ్యర్ధులకు అండగా నిలబడండి" అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments