యుద్ధాన్ని ఆపాలని నేను పుతిన్‌ను ఆదేశించగలనా : సీజేఐ జస్టిస్ ఎన్. వీ. రమణ

  • IndiaGlitz, [Thursday,March 03 2022]

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో భారతీయుల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. అయితే రష్యా ముప్పేట దాడి , సరిహద్దుల్లో పరిస్ధితుల నేపథ్యంలో ఈ ప్రక్రియకు అవరోధాలు కలుగుతున్నాయి. దీనికి తోడు ఇప్పటికే ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో విద్యార్ధుల తరలింపుపై జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తాము చేయగలిగినదేమీ లేదని చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ చెప్పారు. యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను తాను ఆదేశించగలనా అని ఆయన ప్రశ్నించారు. పిటిషనర్ తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది మాట్లాడుతూ, ప్రజలు గడ్డకట్టుకుపోతున్నారన్నారని.. వారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్ రమణ స్పందిస్తూ.. వారిపట్ల సానుభూతి ఉందని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోందని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు.

మరోవైపు.. ఆపరేషన్‌ గంగా'లో భాగంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు మరో 9 విమానాలను కేంద్ర ప్రభుత్వం పంపుతోంది. ఈ విమానాలు మార్చి 4న హంగేరిలోని బుచారెస్ట్‌, బుడాఫెస్ట్‌, ర్జేసో విమానాశ్రయాలకు చేరుకోనున్నాయి. ఈ 9 విమానాల్లో 18 వందల మంది విద్యార్థులను తరలించే అవకాశాలు వున్నాయి.