ఐదు భాషల్లో 'క్యాంపస్అంపశయ్య'
- IndiaGlitz, [Monday,July 04 2016]
'అంపశయ్య' నవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1969లో నవీన్ రాసిన ఈ నవల ఆయన ఇంటి పేరైపోయింది. ఇప్పుడీ నవల ఆదారంగా ప్రభాకర్ జైని తీసిన 'క్యాంపస్-అంపశయ్య' చిత్రం విడుదలకు సిద్ధమైంది. అమ్మానీకు వందనం', 'ప్రణయ వీధుల్లో' చిత్రాల ద్వారా తనలో డిఫరెంట్ ఫిలిం మేకర్ ఉన్న విషయాన్ని ప్రభాకర్ జైని నిరూపించుకున్నారు. 'క్యాంపస్-అంపశయ్య' చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఆయన ఓ ప్రధాన పాత్ర కూడా చేశారు. శ్యామ్ కుమార్, పావని హీరో హీరోయిన్ గా నటించారు. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు ఈ చిత్రాన్ని ఇంగ్లిష్ లో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ చిత్రవిశేషాలను ప్రభాకర్ జైని తెలియజేస్తూ - ''అన్ని భాషలవాళ్లకీ సూట్ అయ్యే కథ ఇది. అందుకే ఇతర భాషల్లో రిలీజ్ చేయబోతున్నాం. ఈ కథలో చక్కటి ఆత్మ ఉంది. విలువలున్నాయి. మానసిక సంఘర్షణలున్నాయి. 'అంపశయ్య' నవల అందరికీ నచ్చింది. ఈ నవలను అందరికీ నచ్చే విధంగా తెరరూపం ఇవ్వడం జరిగింది. ఓ గ్రామం నుంచి ఉస్మానియా యూనివర్శిటీకి చదువుకోవడానికి వచ్చిన ఓ యువకుడి జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే సంఘటనలతో ఈ సినిమా ఉంటుంది. కథానుగుణంగా ఉస్మానియా క్యాంపస్ లో కీలక సన్నివేశాలు తీశాం. ఈ క్యాంపస్ లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం ఇదే. 1970ల నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించాం. ప్రతి సన్నివేశం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. కళ్ల ముందు సహజంగా జరుగుతున్న కథ అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది'' అని చెప్పారు.
ఆకెళ్ల రాఘవేంద్ర, స్వాతీ నాయుడు, మొగిలయ్య, యోగి దివాన్, వాల్మీకి, మోనికా థాంప్సన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమెరా: రవికుమార్ నీర్ల.