ఏపీలో 'కోడ్' రాక ముందే ఎలక్షన్ 'వార్'.. దద్దరిల్లుతున్న మైకులు..
Send us your feedback to audioarticles@vaarta.com
షెడ్యూల్ విడుదల కాక ముందే ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పోటాపోటీగా అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ఎన్నికల శంఖారవం పూరిస్తున్నారు. వరుస సభలు, సమావేశాలతో రాజకీయాలను హీట్ పుట్టిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పల్లెలు, పట్ణణాలు అనే తేడా లేకుండా హోరెత్తిస్తున్నారు. మైకులు దద్దరిల్లేలా ఒకరిపై ఒకరు విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఎన్నికల యుద్ధానికి సై అంటూ కాలు దువ్వుతున్నారు.
కురుక్షేత్రానికి జగన్ 'సిద్ధం'..
ఈ క్రమంలోనే వైసీపీ అధినేత, సీఎం జగన్ ఉత్తరాంధ్ర వేదికగా ఎన్నికల కురుక్షేత్రానికి శంఖం ఊది సై అన్నారు. భీమిలిలో జరిగిన సిద్ధం సభ ద్వారా యుద్ధానికి సిద్ధం అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. వచ్చే 70 రోజులు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కురుక్షేత్రంలో ప్రతిపక్షాల పద్మవ్యూహంలో ఇరుక్కోవడానికి తాను అభిమన్యుడు కాదని అర్జునుడిని అని తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకూ సిద్ధం సభలు నిర్వహించనున్నారు.
'రా.. కదలిరా' అంటున్న బాబు..
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే 'రా కదలిరా' అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల పరధిలో వరుసగా సభలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కనిగిరి, రాజమండ్రి, పీలేరు, వెంకటగిరి, గుడివాడ, అరకు, తిరువూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ సభలకు భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో పార్టీలో జోష్ నెలకొంది. పొత్తులు ఖరారై అభ్యర్థులను ప్రకటించకపోయినా ప్రచారంలో జోరు పెంచారు. గత ఐదేళ్లలో జరిగిన ప్రభుత్వ అరాచకాలు, వైఫల్యాలను ఎండగడుతున్నారు.
ప్రచార బరిలోకి జనసేనాని..
మరోవైపు పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రచార బరిలోకి దిగి ఎన్నికల సమరభేరి మోగించేందుకు సిద్ధమయ్యారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఫిబ్రవరి 4న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి దీవెనలతో జనసేనాని శంఖారావం పూరించనున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే సభలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే పవన్‌తో కొణతాల సమావేశమై పార్టీలో చేరికపై చర్చించారు.
సొంత అన్నపై షర్మిల విమర్శల దాడి..
అటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల జిల్లాల పర్యటన చేస్తూ సొంత అన్న సీఎం జగన్‌పైనా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. యుద్ధానికి తాను సిద్ధం.. మీరు సిద్ధమా? అని సవాల్ విసిరారు. వైఎస్సార్ బిడ్డగా ప్రజలకు న్యాయం చేయాలనే రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చినట్లు స్పష్టంచేశారు. ఆంధ్ర రాష్ట్రానికి హోదా రావాలి.. ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం కావాలి... విశాఖ స్టీల్ ఉండాలి. ఉద్యోగాలు రావాలి అని షర్మిల తెలిపారు. ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపు వచ్చింది. మొత్తానికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రాకముందే ఎలక్షన్ వార్ వచ్చేసింది. ఇక నోటిఫికేషన్ వస్తే రాష్ట్రమంతా ప్రచారాలతో మోత మోగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments