ఏపీలో మూగబోయిన ఎన్నికల మైక్స్!
- IndiaGlitz, [Tuesday,April 09 2019]
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకుని నేటి వరకు జరిగిన ఎన్నికల ప్రచారానికి సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మొత్తం 21 రోజుల పాటు రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ఇన్ని రోజులుగా హోరెత్తిన మైక్‌లు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు మూగబోయాయి. అంతేకాదు.. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు చివరి రోజు ప్రచారం హోరాహోరీగా నిర్వహించాయి. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎల్లుండి అనగా గురువారం రోజున పోలింగ్ జరగనుంది. గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై... సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. కాగా.. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన.. అరకు, పాడేరు, రంపచోడవరంలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే కురుపాం, పార్వతీపురం, సాలూరులో మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
కాగా.. ఇదే రోజు తెలంగాణలో 17 స్థానాలకు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు మొదటి విడుదలలోనే జరుగుతుండటం విశేషమనే చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే.. మే-23న అనగా సరిగ్గా సుమారు నెలన్నరపాటు గ్యాప్‌లో ఫలితాలు వెలువడున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అని యావత్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.