Kaleswaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక.. సంచలన విషయాలు వెల్లడి..
Send us your feedback to audioarticles@vaarta.com
గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలను కాగ్ నివేదిక తీవ్రంగా తప్పుపట్టింది. కాగ్ జారీ చేసిన నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వం చేసిన బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే సంక్షేమ పథకాలపై ఖర్చు చాలా తక్కువగా ఉందని నివేదికలో కాగ్ పేర్కొంది. రెవెన్యూ రాబడి ఎక్కువగా వస్తున్నట్టు.. లోటును తక్కువగా ఉన్నట్టు చూపించారని తెలిపింది. అయితే విద్య, వైద్యంపై ఖర్చులో మాత్రం తెలంగాణ చాలా వెనుకబడి ఉందని.. రాష్ట్రం మొత్తం పెట్టిన ఖర్చులో. విద్య రంగంపై 8 శాతం, వైద్య రంగంపై కేవలం 4 శాతమే ఖర్చు చేసినట్టు వెల్లడించింది.
రూ.1.18లక్షల కోట్ల అప్పులను బడ్జెట్‌లో చూపించలేదని వివరించింది. అప్పుల ద్వారానే రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి ఉంటుందని కాగ్ నివేదిక తెలిపింది. ఇదిలా ఉంటే రాష్ట్రం చేసిన అప్పులకు గానూ 2032-33 నాటికి కేవలం వడ్డీనే రూ.2.52లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల అప్పగింతలోనూ నీటిపారుదల శాఖ తొందరపాటు ప్రదర్శించిందని తెలిపింది. ప్రాజెక్టులో రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా ఖర్చు పెరిగింది తప్ప అదనంగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదంది. ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులను అనవసరంగా చేపట్టారని దీనికి అదనంగా రూ.25 వేల కోట్లు ఖర్చయిందని తెలిపింది.
రీ-ఇంజనీరింగ్ తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిధిలో మరిన్ని మార్పులు, చేర్పులు చేశారని కాగ్ తెలిపింది. ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ఇప్పుడు లక్షా 47 వేల 427.41 కోట్ల రూపాయలకు చేరిందని తన నివేదికలో వెల్లడించింది. అయితే ప్రయోజనాల్లో మాత్రం పెరుగుదల లేదని వివరించింది. డీపీఆర్ ఆమోదానికి ముందే రూ.25 వేల కోట్ల విలువైన 17 పనులను నీటిపారుదల శాఖ కాంట్రాక్టర్లకు అప్పగించిందని ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాగునీటిపై మూలధన వ్యయం ఎకరా ఒక్కింటికి రూ.6.42 లక్షలు ఖర్చవుతోందని తన నివేదికలో పేర్కొంది.
ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు సేకరించినట్టు కాగ్ రిపోర్టు పేర్కొంది. ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం రూ.700 కోట్ల నుంచి రూ.14,500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పింది. రుణాల చెల్లింపు కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరిందింది. కాళేశ్వరం అప్పు చెల్లించుకుంటూ పోతే 2036లో పూర్తవుతుందని కాగ్ నివేదికలో అంచనా వేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com