ముగిసిన కేబినెట్ భేటీ.. బాబు సక్సెస్.. నవ్వులే నవ్వులు!
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎట్టకేలకు అనుకున్నది సాధించారు.!. కేబినెట్ భేటీ పెట్టి తీరాల్సిందేనని గట్టిగా పట్టుబట్టి కూర్చున్న చంద్రబాబు ఆఖరికి సమావేశం పెట్టి తీరారు.!మంగళవారం నాడు సుమారు రెండు గంటలకుపైగా కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ‘ఫొనీ’ తీవ్ర తుపానుతో ఉత్తరాంధ్రలో వాటిల్లిన నష్టం, ఏపీలో నీటి ఎద్దడి, కరవు పరిస్థితులు, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న అనేక అంశాలపై సమావేశంలో నిశితంగా చర్చించారు.
అధికారులు అన్నీ చెప్పారు..!
ఈ సమావేశంలో కేబినెట్ మంత్రులు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, విపత్తు నిర్వహణ శాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు వారివారి శాఖలకు సంబంధించిన అంశాలను సీఎం వద్ద ప్రస్తావించారు. ‘ఫొనీ’ తుపాను కారణంగా ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.58 కోట్ల మేర నష్టం వాటిల్లిందని.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతోపాటు పలు పంటలకు కూడా నష్టం వాటిల్లినట్టు అధికారులు చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. తాగునీటి ఎద్దడిపై చర్చ సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉందని బాబు దృస్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం అమలులో ఉత్తమ రాష్ట్రంగా నిలిపిన అధికారులందరీ చంద్రబాబు అభినందనలు తెలిపారు.
సమావేశంలో నవ్వులే.. నవ్వులు..!
మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నవ్వుల వర్షం కురిసింది. ఆర్టీజీఎస్ ద్వారా పిడుగుపాటు, ఎండ తీవ్రత గురించి ముందే తెలుసుకుంటున్న విషయం విదితమే. ఇదే ఆర్టీజీఎస్..'ఎన్నికల్లో ఓట్ల సునామీ గురించి ముందే చెప్పదా?' అంటూ చంద్రబాబును ఉద్దేశించి మంత్రి ఆది నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో సమావేశమంతా నవ్వులతో నిండిపోయిందని తెలిసింది. ఇందుకు చంద్రబాబు రియాక్ట్ అవుతూ 'ఓట్ల సునామీ గురించి మీ చెవిలో చెబుతారులే' అంటూ సమాధానమివ్వడంతో మరోసారి కేబినెట్‌లోని మంత్రులు, అధికారులు నవ్వుకున్నారు.
సీఎస్‌తో కాదు.. ఈసీతోనే!
"ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో తమకు ఏ సమస్యా లేదు.. ఈసీ వైఖరిపైనే మా అభ్యంతరం. అధికారులతో మాకు ఎలాంటి సమస్యా లేదు.. వారి సహకారం వల్లే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాం. ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూశారు. 'కోడ్' అమలులో ఉన్నప్పుడు కొత్త విధాన నిర్ణయాలు మాత్రమే తీసుకోకూడదు అంతే. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు స్పందించడం ప్రభుత్వ బాధ్యత .'ఫణి' తుపాన్ వల్ల ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని, బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించాం" అని మంత్రి సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments