'తెలంగాణ ఫిలిం చాంబర్' ఆధ్వర్యంలో సినారె సంస్మరణ సభ
- IndiaGlitz, [Tuesday,June 20 2017]
'తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్' ఆధ్వర్యంలో రచయిత సి. నారాయణరెడ్డి సంస్మరణ సభ సోమవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యక్రమానికి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ సిధారెడ్డితోపాటు ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, పరుచూరి బ్రదర్స్, టీఎఫ్‌సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్, తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, ప్రసాద్ ఐమాక్స్ అధినేత రమేష్ ప్రసాద్, దర్శకులు బి.గోపాల్, సినీనటీమణులు కవిత, గీతాంజలి, ఖైరతాబాద్ తెరాస నియోజకవర్గ ఇంఛార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, టీఎఫ్‌సీసీ ప్రతినిధులు సాయివెంకట్, రవి, సినారె కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీ-చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.... ' సినిమా ఇండస్ట్రీ లో 30 ఏళ్ల నుంచి ఉన్నాను. సినారె గారితో మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్నో గొప్ప రచనలు చేశారు. 3000 కు పైగా పాటలు రచించారు. ఆయన ప్రతిభకు ఎన్నో అవార్డులు అందుకున్నారు. అంత గొప్ప దిగ్గజం ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన అంతిమ యాత్ర లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాల్గొన్నారంటే ఎంత గొప్ప వ్యక్తినో తెలుస్తోంది. అంతిమ యాత్రలో పాల్గొన్న తొలి ముఖ్యమంత్రి ఆయనే. సినారె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నా' అని అన్నారు.
పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ... ' ఇద్దరు గొప్ప వ్యక్తులు దాసరి, సినారె గారు మన మధ్యన లేకపోవడం భాధాకరం. సినారె అధ్యక్షతనే రఘుబాబు నాటకొత్సవాలు జరిగేవి. ఇకపై ఆ ఉత్సవాల్లో ఆయన పేరిట ఉత్తమ రచయిత అవార్డును అందిస్తాం. తెలుగు అక్షరం ఉన్నంత కాలం సినారె మన మధ్యనే ఉంటారు' అని అన్నారు.
టి-ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ సాయి వెంకట్ మాట్లాడుతూ... ' సినారె గారు కొన్ని వేల పాటలు రచించారు. ఆయన పాటలంటే ఎంతో ఇష్టం. అలాంటి గొప్ప వ్యక్తి ని కోల్పోవడం బాధాకరం' అని అన్నారు.
రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ... ' సినారె గారి స్థానాన్నిమరొకరు భర్తీ చేయలేరు. గొప్ప లెంజెడరీ రైటర్ ఆయన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నా' అని అన్నారు.
కవిత మాట్లాడుతూ...' 14 ఏళ్ల వయసులో సినారె గారితో పరిచయం ఏర్పడింది. ఆయన పాటలు రచించిన సినిమాలో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నా. పెద్ద స్టార్ అవుతావని ఆరోజుల్లోనే ఆయన నన్ను భుజం తట్టి ప్రోత్సహించారు. ఆయన మరణ వార్త విని ఒక్కసారిగా షాక్ కు గురయ్యా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నా' అని అన్నారు.
దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ... ' స్టేట్ రౌడీ' చిత్రానికి ఆయన పాట రాశారు. అప్పటి నుంచి ఆయనతో మంచి అనుబంధం ఉంది. వేల పాటలను రచించిన గొప్ప వ్యక్తి. ఆయన రచించిన ప్రతీ పాట ఆణి ముత్యమే' అని అన్నారు.