ఏపీ ప్రభుత్వ తీరుపై సి.కల్యాణ్ అభ్యంతరం
- IndiaGlitz, [Monday,December 21 2020]
కోవిడ్ ప్రభావంతో దేశమంతటా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమా థియేటర్స్ మూత పడ్డాయి. ఇటీవల థియేటర్స్‌ను యాబై శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోవచ్చునని ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాయి. అయితే ఎగ్జిబిటర్స్ థియేటర్స్‌ను తెరవలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే దీనిపై తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ అభ్యంతరాన్ని తెలిపారు. సినీ పరిశ్రమలో ఒక విభాగానికి మాత్రమే రాయితీలు ప్రకటించడం సరికాదు. విద్యుత్ బిల్లులను రద్దు చేయడం వల్ల నిర్మాతలకు ప్రయోజనం లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఏపీ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పిన కల్యాణ్.. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.