నేనెవరో తెలీదా.. జగన్ సెక్యూరిటీతో బైరెడ్డి సిద్ధార్థ్ వాగ్వాదం!
Send us your feedback to audioarticles@vaarta.com
యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. వయసు చిన్నదే అయినప్పటికీ మాస్ ఫాలోయింగ్ ఉన్న ఈ యువకుడు కర్నూలు జిల్లాలో కీలకంగా ఉన్నాడు. అంతేకాదు.. ఒకట్రెండు నియోజకవర్గాలను కూడా శాసిస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఎన్నికలకు ముందు.. ఎన్నికల తర్వాత ఈయన్ను కీలక పదవి వరించనుందని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. అంతేకాదు.. సీఎం వైఎస్ జగన్తో ఎలాంటి అపాయిట్మెంట్ లేకుండా డైరెక్టుగా వెళ్లి కలిసేంత చనువు ఉంది. అయితే ఇదంతా ఎన్నికల ముందు వరకే.. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఇందుకు తాజాగా జగన్ కర్నూలు పర్యటనలో జరిగిన ఘటనే ఇందుకు చక్కటి ఉదాహరణ.
జగన్ కలవాలనుకుంటే..!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు కర్నూలు జిల్లాలో పర్యటించి ‘మూడో దశ వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు హాజరయ్యారు. వారితో పాటు బైరెడ్డి సిద్ధార్థ్ కూడా హాజరయ్యాడు. అయితే.. ఈ కార్యక్రమంలో జగన్ సెక్యూరిటీ నుంచి బైరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జగన్ సభా వేదికపై రాక మునుపు నుంచే సీఎంను కలవాలనుకున్న ఆయనకు చివరికి అది నిరాశగా మిగిలిపోగా.. చేదు అనుభవం చవిచూడాల్సి వచ్చింది.
చెయ్యేసి మరీ తోసేశారు!
జగన్ను కలవడానికి కాన్వాయ్ ముందు నుంచి వెళ్తుండగా.. సెక్యూరిటీ సిబ్బంది తోసేశారు. హేయ్ ఎక్కడికెళ్తున్నావ్.. సీఎం కాన్వాయ్ వెళ్తుంటే అని ఆయన్ను వీపుపై చెయ్యేసి తోసేశారు. మరో సెక్యూరిటీ అయితే ఏకంగా ఆయనపై చేయిచేసుకునేంత పనిచేశాడు. నేను బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని ఎవరో తెలియదా..? అని చెబుతున్నప్పటికీ సెక్యూరిటీ మాత్రం కాస్త అతి చేసి ఆయన్ను అక్కడ్నుంచి పంపేందుకు యత్నించారు. ఈ క్రమంలో జగన్ సెక్యూరిటీ వర్సెస్ బైరెడ్డిగా పరిస్థితులు మారాయి. సెక్యూరిటీతో ఆయన వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడున్న కొందరు ఘటనాస్థలికి వచ్చి సర్ది చెప్పి పంపారు. ఈ ఘటనతో బైరెడ్డి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వీడియో.. ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇదేనా బైరెడ్డికి మీరిచ్చే మర్యాద అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. ఇంత జరిగినా ఇటు వైసీపీ నేతలు కానీ.. బైరెడ్డి కానీ మీడియా ముందుకొచ్చి రియాక్ట్ అవ్వలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments