దేశ వ్యాప్తంగా 54 అసెంబ్లీ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్..

  • IndiaGlitz, [Tuesday,November 03 2020]

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్‌ నేడు ప్రారంభమైంది. 10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఈ పోలింగ్ జరుగుతోంది. తెలంగాణ(దుబ్బాక), మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, యూపీ, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, జార్ఖండ్‌, కర్నాటక, ఒడిశా, నాగాలాండ్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. రెండో విడతలో 94 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 94 స్థానాలకు గాను.. 1,463 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

దుబ్బాకలో కొనసాగుతున్న పోలింగ్..

దుబ్బాకలో ఉపఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. దుబ్బాక ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 1,98,756 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఈ క్రమంలోనే దుబ్బాకలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాల దగ్గర భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. టెంపరేచర్‌ చెక్‌ చేసిన తరువాత ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. కోవిడ్‌ బాధితులకు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఓటుహక్కను వినియోగించుకునే అవకాశం కల్పించారు.

మధ్యప్రదేశ్ చరిత్రలోనే...

మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు ఉపఎన్నిక కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌ చరిత్రలో 28 స్థానాలకు ఉపఎన్నికలు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ జరుగుతోంది. 25 స్థానాల్లోని అభ్యర్థులు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరినవారే కావడం గమనార్హం. 9 స్థానాల్లో గెలిస్తే బీజేపీకి సంపూర్ణ మెజారిటీ లభిస్తుంది. 28 సీట్లు గెలిచినా మేజిక్‌ ఫిగర్‌కు ఒక సీటు దూరంలో కాంగ్రెస్‌ ఉండనుంది.