‘పవన్ కల్యాణ్ చతికిలపడ్డాడు.. హరీశ్ రావు ప్రయత్నాలు’..!
- IndiaGlitz, [Sunday,December 29 2019]
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీపీఎం నేత రాఘవులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్-బీజేపీ సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ కామెంట్స్ చేశారు. వాస్తవానికి మునుపటిలాగా కాకుండా పవన్ ఈ మధ్యే బీజేపీకి దగ్గరువుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు.. మొన్నటి వరకూ బీజేపీని తిట్టిపోసిన పవన్.. ఇప్పుడేమో అబ్బే అదేం లేదు.. బీజేపీ చాలా మంచిది.. ఆ పార్టీతో తనకెప్పుడూ గొడవల్లేవంటూ మాట్లాడేస్తున్నారు. దీంతో ఇన్ని రోజులూ పవన్ వైపే ఉన్న వామపక్ష పార్టీలు దూరమయ్యాయ్. పవన్ వ్యాఖ్యలపై అప్పట్లో ప్రెస్‌మీట్స్ పెట్టి వామపక్ష నేతలు దుమ్మెత్తి పోశారు కూడా. అయితే ఈ వ్యవహారంపై తాజాగా.. రాఘవులు మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
చతికిలపడ్డ పవన్.. హరీశ్ ప్రయత్నాలు!
‘పవన్ కళ్యాణ్ చతికిల పడ్డాడు. పవన్ కళ్యాణ్ బీజేపీతో దోబూచులాడన్నాడు. బీజేపీకి దగ్గరవుతున్న వారితో మేము దూరంగా ఉంటాం’ అని కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా రాజధాని గురించి మాట్లాడిన రాఘవులు పలు సూచనలు, సలహాలు చేశారు. అమరావతే రాజధాని అని చెప్పి ముక్కలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిని ముక్కలు చేసి క్యాంప్ మాత్రం వైజాగ్‌లోనే అని చెప్పడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. అసలు ఇదెలా సాధ్యమవుతుందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. రైతుల కష్ట నష్టాలు ఒక భాగం.. రాజధాని అంశం ఒక భాగం. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్ధలను వేర్వేరు చోట్ల వుండచ్చు కానీ పాలనవిషయంలో ప్రయోగాలు తగదు. జనవరి 8 సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాం. ఆర్థిక దుస్ధితి, రాజకీయ అల్లకల్లోలాకు వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చాం. ఏపీలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నందున పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలంగాణ నేతలు, హరీష్ రావు ప్రయత్నిస్తున్నారు. రాజధాని అమరావతిలో వుండాలి. అయితే అది చంద్రబాబు చెప్పిన విధంగా కాదు. 1500 ఎకరాల్లో రాజధాని సరిపోతుంది’ అని రాఘవులు వ్యాఖ్యానించారు.
అయితే రాఘవులు వ్యాఖ్యలు వైసీపీ నేతలు, పవన్ కల్యాణ్, హరీశ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.