Buses:అద్దె బస్సుల ఓనర్లతో చర్చలు సఫలం.. రేపటి నుంచి యథావిధిగా బస్సులు..
Send us your feedback to audioarticles@vaarta.com
అద్దె బస్సు యజమానులతో తెలంగాణ ఆర్టీసీ(TSRTC) ఎండీ సజ్జనార్(Sajjanar) జరిపిన చర్చలు ఫలించాయి. ఈ సందర్భంగా సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ అద్దె బస్సు ఓనర్లు కొన్ని సమస్యలు తమ దృష్టికి తెచ్చారని.. వారం రోజుల్లో వారి సమస్య పరిష్కారానికి ఓ కమిటీ వేస్తామని తెలిపారు. దీనిపై అద్దె బస్సుల వారు సానుకూలంగా స్పందించారన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,700 అద్దె బస్సులు రేపటి నుంచి యథావిధిగా నడుస్తాయని స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,700 అద్దె బస్సులు నడుస్తున్నాయి. అలాగే సంక్రాంతికి కూడా ఉచిత బస్సు సర్వీసులు ఉంటాయని.. స్పెషల్ బస్సులు నడుపుతామని వెల్లడించారు.
మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి 4,484 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు చెప్పారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ హైదరాబాద్ నుంచి తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. నగరం నుంచి ఏపీకి రద్దీ దృష్ట్యా 1,450 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ముందస్తు రిజర్వేషన్ల సౌకర్యం కూడా కల్పించామని ఆయన వివరించారు.
కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 'మహాలక్ష్మి' పథకం కింద ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో బస్సుల్లో రద్దీ పెరగడంతో పాటు ప్రయాణికుల సంఖ్య కూడా రెట్టింపు అయింది. ఈ నేపథ్యంలో అద్దె బస్సుల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. విపరీతమైన రద్దీతో బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయంటూ వాపోయారు. కనీసం మైలేజ్ కూడా కూడా రావడం లేదని అందుకే ఈనెల 5వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
ఇదిలా ఉంటే మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకూ 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి రోజూ 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లు మంజూరు చేస్తున్నామని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బందిని మంత్రులు, అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout