Burra Katha Review
రచయితలు దర్శకులుగా మారుతున్నారు. ఆ క్రమంలో డైరెక్టర్‌గా మారాడు రైటర్ డైమండ్ రత్నబాబు. తొలి ప్రయత్నంలో ఈయన తెరకెక్కించిన చిత్రం `బుర్రకథ`. ఆదిసాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరో హీరోయిన్లుగా నటించారు. ఆది సాయికుమార్‌కి హిట్ వచ్చి చాలా కాలమే అయ్యింది. మరి బుర్రకథతో అటు ఆది సాయికుమార్.. ఇటు డైమండ్ రత్నబాబు సక్సెస్ అందుకున్నారా? లేదా? అని తెలియాలంటే సినిమా కథేంటోచూద్దాం.
కథ:
అభిరామ్ రెండు మెదళ్లతో పుడతాడు. పెరిగే క్రమంలోనే ఆ విషయం తల్లిదండ్రులకు అర్థమవుతుంది. ఈ కారణంగా అభి, రామ్ అనే రెండు మనస్తత్వాలున్న వ్యక్తులుగా అభిరామ్ ప్రవర్తించి అందరినీ కన్‌ఫ్యూజ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అభి మాస్‌గా పెరిగి పెద్దవుతాడు. రామ్ క్లాస్‌గా, కామ్‌గా పెరిగి పెద్దవుతాడు. రామ్ సన్యాసం తీసుకోవాలని అనుకుంటే అభి.. హ్యపీ(మిస్తీ చక్రవర్తి)ని ప్రేమించమని వెంటపడుతుంటాడు. ఓ సందర్భంలో ఎమ్మెల్యే కావాలకున్న గగన్(అభిమన్యుసింగ్) ఓ తప్పు చేస్తాడు. దాన్ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి అతని రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తాడు. ప్రభుత్వం గగన్‌ను నగరం నుండి బహిష్కరిస్తుంది. దాంతో గగన్ రామ్‌పై పగ పెంచుకుని అతన్ని చంపాలనుకుని తిరుగతుంటాడు. మరో పక్క అభి, రామ్ ఇద్దరూ హ్యాపీని ఇష్టపడతారు. అయితే హ్యాపీ తండ్రి ప్రభుదాస్(పోసాని కృష్ణమురళి) అభిలా ఆలోచించి వ్యక్తికి కాకుండా రామ్‌లా ఆలోచించే వ్యక్తికే తన కూతుర్ని ఇస్తానని చెబుతాడు. అంతే కాకుండా ఫేమస్ బ్రెయిన్ సర్జన్ అయిన ప్రభుదాస్ పెళ్లి తర్వాత అభిలా ఆలోచించే ఓ మెదడుని తీసేయాలని కూడా చెబుతాడు. మరి అప్పుడు అభిరామ్ తల్లిదండ్రులు ఏం చేస్తారు? చివరకు అభిలా ఆలోచించే మెదడుని తీసేశారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
నటీనటుల పరంగా చూస్తే ఆది రెండు విభిన్నమైన మనస్తత్వాలుండే ఒకే వ్యక్తిలా చక్కగా నటించాడు. గత చిత్రాలతో పోల్చితే పెర్ఫామెన్స్ పరంగా తనకు ఈ చిత్రం కాస్త బెటర్ అనే చెప్పొచ్చు. రెండు పాత్రలకు తన శక్తి మేర న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. ఇక మిస్తీ చక్రవర్తి పాత్రకు న్యాయం చేసింది. తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్‌ను ఉపయోగించుకున్న తీరు కొన్ని సన్నివేశాల్లోనే బాగున్నాయి. కొన్ని సీన్స్‌లో రాజేంద్ర ప్రసాద్‌లాంటి సీనియర్ నటుడు ఆ సన్నివేశాలు చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడా? అనిపించేలా ఉన్నాయి. ఇక పోసాని కృష్ణమురళి, థర్టీఇయర్స్ పృథ్వీపాత్రలు కాస్త కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాయి కానీ మెప్పించలేకపోయారు. ఇక సాంకేతికంగా చూస్తే రైటర్ రత్నబాబు దర్శకుడిగా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇలాంటి సినిమాను తెరకెక్కించడానికి ఐదుగురు స్క్రీన్‌ప్లే రైటర్స్ ఎందుకా? అనిపించేలా సన్నివేశాలున్నాయి. ఏ సన్నివేశాలు ఆకట్టుకునేలా లేవు. కామెడీ కోసం చేసిన సన్నివేశాలు ప్రేక్షకుడికి చిరాకు తెప్పించేలా ఉన్నాయి. సాయికార్తీక్ పాటలు, నేపథ్య సంగీతం బాలేవు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. కథ సాగే క్రమంలో ప్రేక్షకుడికి కన్ఫ్యూజన్ తగ్గాలని కానీ.. పెరిగిపోతుంది. అనవసరమైన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి.
చివరగా.. బుర్ర కథ.. తల తిరగడం పక్కా
- Read in English