Telangana Congress: కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుల భారం.. గ్యారంటీలు నెరవేర్చడం సాధ్యమేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు వచ్చేశాయి. కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా గత తొమ్మిదిన్నరేళ్లుగా అధికారంలోకి రావాలని హస్తం పార్టీ తీవ్రంగా పోరాటం చేసింది. ఎట్టకేలకు ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఆదరించి అధికారం కట్టబెట్టారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఇప్పుడే ఆ పార్టీకి అసలు సవాల్ మొదలుకానుంది. ఎందుకంటే ప్రచారంలో భాగంగా ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించింది. ఈ హామీలు పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించాయి.
ఏడాదికి రూ.1.2లక్షల కోట్లు అవసరం..!
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం ఈ గ్యారంటీల ముసాయిదాపైనే చేశారు. కానీ ఐదు సంవత్సరాల పాటు వీటి అమలుకు భారీగా నిధులు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థిక నిపుణులు చెబుతున్న లెక్కల ప్రకారం ఆరు గ్యారంటీల అమలుకు ఏటా సుమారు రూ.70 వేల కోట్లు.. ఈ హామీలతో పాటు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలుచేయాలంటే ఏడాదికి దాదాపు రూ.1.2 లక్షల కోట్లు అవసరమని అంచనా వేస్తు్న్నారు. అయితే అర్హులకు సంబంధించిన విధివిధానాల ఖరారు తర్వాత ఖర్చుపై దీనిపై మరింత స్పష్టత రానుంది.
ఆరు గ్యారంటీల హామీలు ఇవే..
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు రూ.16 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరికి క్వింటాలుకు రూ.500 అదనపు సాయం అందిస్తామని ప్రకటించింది. ఇందిరమ్మ గృహ నిర్మాణం కింద ఇల్లు లేని కుటుంబాలకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, గృహజ్యోతిలో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, యువ వికాసంలో ద్వారా విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డులు.. చేయూత పథకం కింద పింఛన్‌లను రూ.4వేలకు, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ.10 లక్షలకు పెంచడం వంటివి ఆరు గ్యాంటీల హామీల్లో ఉన్నాయి.
రూ.3లక్షల కోట్ల అప్పులు..
మరోవైపు విద్యుత్ సంస్థలు కూడా భారీ అప్పుల్లో కూరుకుపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించగా.. అధికారులు రాష్ట్రంలోని నాలుగు డిస్కంల అప్పులు రూ.81,516 కోట్లకు చేరాయని తెలిపారు. ఇప్పుడు ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే ప్రభుత్వానికి మరింత భారం కానుంది. ఇందుకోసం దాదాపు రూ.4వేల కోట్ల వరకు ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పులు రూ.3లక్షల కోట్ల పైనే ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్ రూ.2,90,000 కోట్లు ఉంటే అప్పులు అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హామీలు ఎలా నెరవేరుస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout