బాలిక విద్య కోసం బన్నీ వాసు ఆర్థిక సహాయం
- IndiaGlitz, [Thursday,May 17 2018]
ప్రముఖ నిర్మాత బన్నీ వాసు మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆడపిల్లలను చదివించాలని తపనపడే బన్నీ వాసు... ఎవరైనా నిరుపేదలు తన దగ్గరికి వస్తే కాదనకుండా ఆర్థిక సహాయం చేస్తాడు. ఈ క్రమంలో ఈటీవీ తెలంగాణలో ప్రసారమైన చదివిద్దాం కథనానికి స్పందించిన బన్నీ వాసు... సంధ్య చదువు కోసం తనవంతు ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. పదో తరగతిలోనే బాల్య వివాహాన్ని ఎదిరించి ఇంటర్ లో 86 శాతం మార్కులతో పాసైన సంధ్య తన కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల డిగ్రీ చదవలేక చదువు మానేద్దామని నిర్ణయించుకుంది.
ఈ విషయం తెలుసుకున్న ఈటీవీ తెలంగాణ ఛానెల్... సంధ్య కుటుంబ పరిస్థితి, చదువు పట్ల సంధ్యకున్న శ్రద్ధ పై చదివిద్దాం పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనాన్ని చూసిన బన్నీ వాసు... సంధ్య చదువు కోసం ముందుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా బ్రహ్మాణపల్లి నుంచి సంధ్యను తన కార్యాలయానికి పిలుపించుకొని డిగ్రీ చదువుకయ్యే ఖర్చులను అందించడంతోపాటు ప్రతి నెల 5 వేల రూపాయల స్టైఫండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బన్నీ వాసు ఆర్థిక సహాయంతో నిరుపేద బాలిక సంధ్య దిల్ సుఖ్ నగర్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదవబోతుంది. డిగ్రీ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగి కావాలన్న తన లక్ష్యానికి నిర్మాత బన్నీ వాసు చేయూత నివ్వడం పట్ల సంధ్య ఆనందం వ్యక్తం చేసింది. బన్నీవాసు ప్రోత్సాహాన్ని ఎప్పటికి మరిచిపోలేనని సంధ్య తెలిపింది. చదువు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడి తనలాంటి అమ్మాయిల చదువుకు తోడ్పతానని ఈ సందర్భంగా సంధ్య తెలిపింది.