ప్రజలకు బంపర్ ఆఫర్.. జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేటీఆర్ క్లారిటీ
- IndiaGlitz, [Saturday,November 14 2020]
ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుకను ప్రకటించింది. నేడు బీఆర్కే భవన్లో సీఎస్ సోమేష్ కుమార్తో భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అటు తెలంగాణ ప్రజానీకానికి ఇటు పారిశుద్ధ్య కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలపై క్లారిటీని సైతం ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్నులో 50శాతం రాయితీనిస్తున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. ఇది ఆస్తిపన్ను రూ.15 వేల వరకూ కట్టిన వారికి వర్తించనుంది. అలాగే ఇతర ప్రాంతాల్లో రూ.10 వేలలోపు ఆస్తి పన్నుకట్టిన వారికి వర్తించనుంది. ఆస్తి పన్ను రాయితీని ప్రకటించడంతో హైదరాబాద్లో 13 లక్షల 72 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని కేటీఆర్ వెల్లడించారు.
పారిశుద్ధ్య కార్మికులకు వేతనం పెంపు..
రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల 60 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ.. వర్షం ఆగకముందే వరద సాయం ప్రకటించిన ఘనత తమదేనన్నారు. నిజమైన వరద బాధితులు మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. వరద బాధితుల కోసం అదనంగా మరో రూ.70 కోట్లు వరద బాధితుల కోసం కేటాయిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికులకు రూ. 17,500 వేతనం పెంచనున్నట్టు వెల్లడించారు. దీని కారణంగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలు రూ.14,500 నుంచి రూ.17,500కి పెరగనున్నట్టు తెలిపారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొందరొద్దు..
నిన్నటి వరకూ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెలలో ముగించాలని.. దీపావళి అనంతరమే నోటిఫికేషన్ ఇవ్వాలని భావించిన ప్రభుత్వం ఎందుకో వెనుకడుగేసినట్టు కేటీఆర్ మాటలను బట్టి తెలుస్తోంది. నేడు సీఎస్తో జీహెచ్ఎంసీ ఎన్నికల విషయమై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొందర పడాల్సిన అవసరం లేదని కేటీఆర్ వెల్లడించారు. దీంతో దీపావళి అనంతరమే జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు చాలా తక్కువని తెలుస్తోంది.