ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎంజీఎం

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా తిరిగి రావాలని దేశం మొత్తం కాక్షింస్తోంది. కరోనాతో పోరాడుతున్న ఆయన ఆరోగ్యంలో మార్పేమీ లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్‌ను తాజాగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రి విడుదల చేసింది. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని.. ప్రస్తుతం కూడా ఐసీయూలో వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో చికిత్సను అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

‘‘కరోనాతో బాధపడుతూ ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి చికిత్సను అందిస్తున్నాం. వెంటిలేటర్, ఎక్మో సాయంతో ఆయన ఐసీయూలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మా వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ఎస్పీ బాలు ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం’’ అని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

కాగా.. ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఆయన కుమారుడు చరణ్ మాట్లాడుతూ.. ‘‘గురువారం నాన్న గారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. అయితే నేడు నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీనర్థం పూర్తి కోలుకున్నారని కాదు. వైద్యులు మాత్రం ఆయన కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీ అందరి ప్రార్థనల కారణంగా నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇది మాకు చాలా సంతోషాన్నిస్తోంది. మా కుటుంబంపై మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు’’ అని తెలిపారు.