వెన్నునొప్పితో ఆస్పత్రికెళితే యువతి శరీరంలో బుల్లెట్.. అసలేం జరిగింది!?
- IndiaGlitz, [Tuesday,December 24 2019]
హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాకు చెందిన అస్మాబేగం అనే యువతి వెన్ను నొప్పితో నిమ్స్‌లో అడ్మిట్ అవ్వడంతో.. ఆమె శరీరంలో నుంచి బుల్లెట్ ప్రత్యక్షమవ్వడం కలకలం రేపుతోంది. ఎమ్మారై స్కాన్ చేయగా.. బుల్లెట్‌ను గుర్తించిన వైద్యులు కంగుతిన్నారు!. అసలేం జరిగిందని ఆరాతీయగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో వ్యవహారం పోలీసుల దాకా చేరడంతో రంగంలోకి దిగి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ కేసును పంజాగుట్ట, ఫలక్‌నుమా పోలీసులు సంయుక్తంగా విచారణ చేపడుతున్నారు. కాగా.. రెండేళ్ల క్రితం నాటు తుపాకీతో కాల్పుడు జరపడం వల్లే ఆ యువతి శరీరంలోకి బుల్లెట్ వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం బయటికి పొక్కితే కేసులు, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగాల్సి వస్తుందని భయంతో ఎవరికీ తెలియకుండా నాటు వైద్యం చేయించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
బుల్లెట్ ఎక్కడిది..? కాల్చిందెవరు!?
కాగా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. యువతి శరీరంలో బుల్లెట్ ఉంది సరే.. మరి తుపాకీ సంగతేంటి..? తుపాకీ లెసెన్స్‌డా..? లేక అక్రమ ఆయుధమా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా.. హైదరాబాద్‌లోని కింగ్స్ ఫంక్షన్ హాల్ యజమాని కొడుకు జుబేర్ కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. ఈ కాల్పుల వ్యవహారంపై జుబేర్‌పై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. అయితే.. బాధితురాలి తండ్రి కింగ్స్ ఫంక్షన్ హాల్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసేవారు. అయితే అప్పట్లో జరిగిన కాల్పుల్లో యువతికి బుల్లెట్ తగిలి గాయమైందా..? ఈ విషయం బయటికి పొక్కనీయకుండా బాధితురాలు, నిందితుడు ఇద్దరూ రహస్యంగా ఉంచారా..? అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఈ ఘటనలో అసలు విషయాలు తెలియాలంటే పోలీసులు విచారణలో నిజానిజాలు తెలిసేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.