భూమలు ‘బాంబ్’ పేల్చిన బుగ్గన.. టీడీపీలో కలవరం!
- IndiaGlitz, [Tuesday,December 17 2019]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, ఉపాధి హామీ నిధులతో పాటు అతి ముఖ్యమైన నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై హాట్ హాట్‌గా చర్చ జరిగింది. మొదట్నుంచి అనగా తనకు ఎలాంటి పదవి లేకున్నప్పటికీ తానేంటో.. తన సత్తా ఏంటో చూపిస్తూ వచ్చిన ప్రస్తుత ఆర్థిక మంత్రి.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ టీడీపీ నేతల బాగోతాలను బయటపెట్టారు. అసెంబ్లీ వేదికగా ఎవరెవరెన్ని ఎకరాలు భూములు కొన్నారో ఆయన జాబితాను విడుదల చేశారు. అంతేకాదు.. ఎక్కడెక్కడ కొన్నారు అనేది అసెంబ్లీలో మ్యాప్‌తో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే.. రాజధానిలో టీడీపీ నేతలు, వారి బినామీలే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఈ సందర్భంగా ఆయన స్పష్టంగా చెప్పుకొచ్చారు.
బాబు బాగోతం ఇదీ..!
జూన్ 1, 2014 ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఏపీ రాజధాని అమరావతి అని ప్రకటన వెలువడే 31 డిసెంబర్ 2014వరకు గల కాలం ఆరు నెలలు నుంచి ఈ రోజు వరకు 4070 ఎకరాలు టీడీపీ నేతలు తమ పేరనే కాక తమకు కావాలసిన బంధువుల పేరన చేసుకున్నారన్నారు. హెరిటేజ్ కోసం మొత్తం 14.22 ఎకరాలు కొన్నారని ఆయన అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. టీడీపీ నేతల చేత ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. రాజధానిలో భూములు కొన్నవాళ్లంతా చంద్రబాబుకు చెందిన వాళ్లేనని.. స్థానికులు ఎవరూ లేరని అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారు.
వియ్యంకుల బాగోతం ఇదీ..!
బాలయ్య వియ్యంకుడు- 499 ఎకరాలు
లింగమనేని రమేష్- 351 ఎకరాలు
కొమ్మలపాటి శ్రీధర్-60 ఎకరాలు
వేమూరి రవి కుమార్-62.77 ఎకరాలు
మాజీ మంత్రి నారాయణ- 55.27 ఎకరాలు
రావెల కిశోర్ బాబు-40.85 ఎకరాలు
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు- 38.84 ఎకరాలు
పయ్యావుల కేశవ్- 15.3 ఎకరాలు
కోడెల శివప్రసాదరావు-17.13 ఎకరాలు
హెరిటేజ్- 14.22 ఎకరాలు
ధూళిపాళ నరేంద్ర- 13.5 ఎకరాలు
నిమ్మగడ్డ శాంతికుమారి-13.19 ఎకరాలు
పల్లె రఘనాథ్ రెడ్డి-7.85 ఎకరాలు
బుగ్గన ఇంకా ఏమన్నారంటే..
‘గత ప్రభుత్వం చాలా బాధ్యతా రహితంగా పనిచేసింది. అన్ని ప్రాంతాల అభివృద్ది కోసమే మేం వికేంద్రీకరణ చేస్తున్నాం. ప్లాట్లు వేయడానికి సింగపూర్ కంపెనీలను తీసుకొచ్చారు. ఆర్బీఐకి ఎకరం రూ.4కోట్లకు అమ్మితే.. తమ వాళ్లకు ఎకరాన్ని రూ. 20లక్షలకే నాడు చంద్రబాబు ఇచ్చారు’ అని బుగ్గన చెప్పుకొచ్చారు.
మొత్తానికి చూస్తే బుగ్గన అసెంబ్లీ వేదికగా పేల్చిన భూముల బాంబ్‌కు.. టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే ఫలానా టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫలానా మంత్రికి.. ఇన్నెన్ని ఎకరాలున్నాయని వైసీపీకి సంబంధించిన పత్రిక, టీవీ చానెల్లలో పలుమార్లు ప్రసారమయ్యాయి. అప్పట్లో అవన్నీ కొట్టిపారేసినప్పటికీ ఇప్పుడు అక్షరాలా అవన్నీ నిజం చేసి చూపింది వైసీపీ ప్రభుత్వం. మరి ఈ భూముల వ్యవహారంపై మున్ముంథు పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో వేచి చూడాల్సిందే మరి.