Buddha Prasad: అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా బుద్ధప్రసాద్.. రైల్వేకోడూరు అభ్యర్థి మార్పు..
Send us your feedback to audioarticles@vaarta.com
అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ పేరు ఖరారుతో పాటు రైల్వేకోడూరు అభ్యర్థిని మారుస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల టీడీపీ నుంచి బుద్ధప్రసాద్ జనసేనలో చేరారు. అవనిగడ్డ నుంచి టీడీపీ టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్లింది. దీంతో బుద్ధప్రసాద్‌కు నిరాశే ఎదురైంది. అయితే జనసేన నుంచి పోటీ చేయాలని భావించి జనసేనలో చేరారు. దీంతో పార్టీ టిక్కెట్ ఆశించిన బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్ తీవ్ర నిరాశకు గురయ్యారు.
"అవనిగడ్డ శాసన సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును పవన్ కళ్యాణ్ గారు ఖరారుచేశారు. గురువారం ఉదయం పవన్ కళ్యాణ్ గారు పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. తదుపరి ఆయన అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారు. పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి పేరుపై రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై నాయకులతో చర్చిస్తూ, అభిప్రాయ సేకరణ చేస్తున్నారు" అని అందులో తెలిపింది.
మరోవైపు రైల్వేకోడూరు అభ్యర్థిని కూడా మర్చారు. ఈ స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు. అయితే ఆయన అభ్యర్థిత్వంపై స్థానిక జనసేన నేతలతో పాటు టీడీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భాస్కరరావు వైసీపీ ముఖ్య నేతలకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి అని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయనను మార్చి అవర శ్రీధర్‌కు అవకాశం కల్పించారు. ఇక పాలకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున టికెట్ ఆశించిన నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీలో చేరారు. బలమైన నేత కావడంతో ఆయన పేరునే ఖాయం చేస్తారనే చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా పిఠాపురంలో ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఆరోగ్యం కుదుటపడగానే త్వరలోనే తిరిగి ప్రచారం చేయనున్నారు. తెనాలితో పాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. అలాగే కూటమి నిర్వహించే బహిరంగసభల్లోనూ పాల్గొననున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments